Jammu Kashmir: కశ్మీర్‌లో ఉగ్రఘాతుకం..
ఓ వైద్యుడు, ఆరుగురు కార్మికుల మృతి;
జమ్మూకశ్మీర్‌లోని గాందర్‌బల్ జిల్లాలో ఉగ్రవాదులు జరిపిన దాడిలో ఓ వైద్యుడు, ఆరుగురు కార్మికులు మృతిచెందగా, మరో అయిదుగురు గాయపడినట్లు అధికారులు తెలిపారు. జిల్లాలోని గుండ్ వద్ద శ్రీనగర్ - లేహ్ జాతీయ రహదారిలో సొరంగ నిర్మాణపనులు చేస్తున్న ప్రయివేటు కంపెనీ కార్మికుల కోసం తాత్కాలిక ఆవాసాలు ఏర్పాటు చేసింది. ఆదివారం సాయంత్రం కార్మికులు, సిబ్బంది పనులు ముగించుకొని తమ ఇళ్లకు తిరిగి వచ్చారు. ఆ సమయంలో ఇద్దరు ఉగ్రవాదులు వారిపై కాల్పులకు తెగబడ్డారు. పోలీసు బలగాలు, సైనిక దళాలు ముష్కరుల గాలింపునకు చర్యలు చేపట్టాయి. కశ్మీర్ పోలీస్ ఐజీ వి.కె.బిర్ది ఘటనా స్థలాన్ని పరిశీలించారు. స్థానికేతరులైన కార్మికులపై జరిగిన ఈ దాడి పిరికిచర్య అంటూ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఖండించారు. దాడిని హేయమైన చర్యగా ఖండించిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా దీనికి బాధ్యులైన ఉగ్రవాదులను విడిచిపెట్టబోమని ‘ఎక్స్’ ద్వారా పేర్కొన్నారు.
జమ్మూ కాశ్మీర్‌లో మరోసారి ఉగ్రవాదులు అమాయకులైన, పొట్టకూటి కోసం వచ్చిన వలస కార్మికుల్ని కాల్చిచంపారు. ఆదివారం రోజు గందర్‌బల్ జిల్లాలో గగాంగీర్ వద్ద నిర్మాణ స్థలంలో ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో 6గురు భవన కార్మికులు మరణించారు. నిర్మాణంలో ఉన్న సొరంగం సమీపంలో ఈ దాడి జరిగిందని భద్రతా అధికారులు తెలిపారు. ప్రస్తుతం భద్రతా బలగాలు దాడి జరిగిన ప్రదేశానికి చేరుకుని చుట్టుమట్టాయి. ప్రాథమిక నివేదిక ప్రకారం.. దాడికి గురైన కార్మికులు సెంట్రల్ కాశ్మీర్‌లోని గందర్‌బల్ జిల్లాలోని గగనీర్‌ని సోనామార్గ్‌ని కలిపే Z-మోర్హ్ సొరంగం నిర్మాణం కోసం పనిచేస్తున్నారు. జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. నిరాయుధులైన అమాయకులపై దాడిని ఖండిస్తూ, మరణించిన వారికి సంతాపం తెలియజేశారు. అంతకుముందు రెండు రోజుల క్రితం షోపియాన్ జిల్లాలో బీహార్‌కి చెందిన వలస కార్మికుడిని ఉగ్రవాదులు చంపేసిన తర్వాత తాజా దాడి జరిగింది.