Alimony : ఆమెకి.. ఆమె కుక్కలకీ కూడా..
భార్యతో పాటూ కుక్కలకు భరణం ఇవ్వాలన్న బాంబే కోర్టు;
పెంపుడు జంతువులు కూడా మన జీవితంలో భాగమే. మన నిత్య జీవితంలో కుటుంబ సభ్యుల్లా మమేకమైపోయిన వాటిని వేరుగా చూడలేం. అందుకే వాటి నిర్వహణ బాధ్యతలకు కూడా పరిహారం చెల్లించాల్సిందే.’ అని భరణం కేసులో కోర్టు తీర్పు చెప్పింది ముంబై హైకోర్టు. మనుషులు ఆరోగ్యకరమైన జీవితం గడపటానికి పెంపుడు జంతువులు తోడ్పడతాయని, అలాగే యజమానుల మధ్య బంధాలు తెగిపోతే..దాని వల్ల కలిగే మనోవ్యధనుంచి వారు కోలుకోవటానికి పెంపుడు జంతువులు తోడ్పడతాయని ఈ తీర్పు సందర్భంగా కోర్టు అత్యంత ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
మధ్యంతర నెలవారీ భరణం కింద నెలకు రూ.50 వేలను తన 55 ఏండ్ల భార్యకు చెల్లించాలని బాంబే మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోమల్‌సింగ్ రాజ్‌పుట్ తీర్పునిచ్చారు. కేసు వివరాల్లోకి వెళితే ముంబైకి చెందిన ఓ వ్యాపారవేత్తతో విభేదాల కారణంగా అతని భార్య వేరుగా ఉంటోంది. ఆమె తన భర్తపై గృహ హింస కేసు పెట్టింది. తనకు సరైన ఆదాయ వనరు లేదని, భర్త నుంచి విడిపోయాక కూడా తన మూడు కుక్కల నిర్వహణ బాధ్యత కూడా తనపై ఉందని, అందుకోసం నెలకు రూ. 50 వేలు భరణంగా ఇప్పించాలంటూ ఆ మహిళ కోర్టులో కేసు వేసింది. అయితే దీన్ని ఆమె భర్త తిరస్కరించారు. భార్యకు భరణం ఇవ్వడమే కష్టమంటే కుక్కల నిర్వహణ వ్యయం కూడా అడగడం అన్యాయమని వాదించారు. దాన్ని మేజిస్ట్రేట్ కోమల్ సింగ్ తిరస్కరిస్తూ వాటి నిర్వహణకు పరిహారం చెల్లించాల్సిందేనంటూ తీర్పు చెప్పారు.