Droupadi Murmu : నేడు మహాకుంభమేళాకు రాష్ట్రపతి ముర్ము..
భారీగా బలగాల మోహరింపు;
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళాలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొననున్నారు. ప్రయాగ్‌రాజ్‌లో ఎనిమిది గంటలకు పైగా ఉండనున్నారు. సోమవారం ఉదయం 10 గంటలకు రాష్ట్రపతి ప్రయాగ్‌రాజ్‌కు చేరుకుంటారు. గంగా, యమునా, సర్వసతీ నదులు కలిసే త్రివేణీ సంగమంలో పుణ్యస్నానం, ప్రార్థనలు చేస్తారు. అనంతరం బడే హనుమాన్ ఆలయం, పవిత్రమైన అక్షయవత్ వృక్షాన్ని సందర్శిస్తారు. అదేవిధంగా కుంభమేళా ప్రదేశంలో ఏర్పాటుచేసిన డిజిటల్ కుంభ్ అనుభవ్ సెంటర్‌ను పరిశీలిస్తారు. సాయంత్రం 5.45 గంటలకు ప్రయాగ్‌రాజ్ నుంచి న్యూఢిల్లీకి బయల్దేరుతారు. ఈ నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేశారు.
జనవరి 13న పుష్య పౌర్ణమి సందర్భంగా మహాకుంభ్ మేళా ప్రారంభమైన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 26న మహాశివరాత్రి పర్వదినం వరకు ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం కొనసాగుతుంది. ఇప్పటివరకూ 42 కోట్ల మందికి పైగా భక్తులు గంగానదిలో పవిత్రస్నానాలు ఆచరించారు. కాగా, ఈ నెల 5న ప్రధాని మోదీ కూడా కుంభమేళాలో పాల్గొన్నారు. త్రివేణీ సంగమంలో పుణ్యస్నానమాచరించారు. గంగానదికి హారతి ఇచ్చి ప్రత్యేక పూజలు చేశారు. 90 నిమిషాల పాటు ఆయన మహాకుంభమేళాలో గడిపారు.