Vice President : ఉపరాష్ట్రపతి ఎన్నిక నోటిఫికేషన్‌ విడుదల

నామినేషన్లు ప్రారంభం;

Update: 2025-08-07 05:00 GMT

ఉపరాష్ట్రపతి  ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ జారీ చేసింది. సెప్టెంబర్​ 9న ఎలక్షన్ నిర్వహించనున్నట్లు తెలిపింది. నామిషన్లు గురువారం నుంచే ప్రారంభమవుతాయని వెల్లడించింది. 21వ తేదీవరకు నామపత్రాలు స్వీకరిస్తామని తెలిపింది. ఈనెల 22న నామినేషన్లను పరిశీలిస్తామని చెప్పింది. నామినేషన్ల ఉపసంహరణకు ఆగస్టు 25 వరకు గడువు ఇచ్చింది.

ఉపరాష్ట్రపతి జగ్‌దీప్‌ ధన్‌ఖడ్‌ జూలై 21న తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆయన పదవీకాలం 2027 ఆగస్టు వరకు ఉన్నప్పటికీ.. ఆరోగ్య కారణాల దృష్ట్యా పదవి నుంచి తప్పుకుంటున్నట్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఉపరాష్ట్రపతి ఎన్నిక అనివార్యమైంది. ఈ ఎన్నికకు రాజ్యసభ సెక్రటరీ జనరల్‌ రిటర్నింగ్‌ అధికారిగా, మరో ఇద్దరు అధికారులు ఆయనకు సహాయకులుగా ఉంటారని ఎన్నికల సంఘం తెలిపింది.

ఇక ఈ ఎన్నికలో రాజ్యసభ, లోక్‌సభకు చెందిన సభ్యులు ఓటర్లుగా ఉంటారని పేర్కొంది. రాజ్యసభకు నామినేట్‌ అయినవారు కూడా ఓటు వేయవచ్చని తెలిపింది. రాజ్యసభలో 233 మంది ఎన్నికైన సభ్యులు 12 మంది నామినేటెడ్‌ సభ్యులుండగా, లోక్‌సభలో 543 మంది మొత్తం 788 మంది ఓటర్లు. ప్రస్తుతం రాజ్యసభలో ఐదు, లోక్‌సభలో ఒక స్థానం ఖాళీగా ఉంది. ఈ నేపథ్యంలో ఉపరాష్ట్రపతి ఎన్నికలో 782 మంది ఓటు వేయనున్నారు. అందరూ ఓటు వేస్తే గెలిచే అభ్యర్థికి 391 ఓట్లు అవసరమవుతాయి.

Tags:    

Similar News