ED vs West Bengal Govt: సుప్రీంకోర్టులో కేవియట్ దాఖలు చేసిన టీఎంసీ సర్కార్
ఈడీ, బంగాల్ ప్రభుత్వం మధ్య వివాదం
పశ్చిమ బెంగాల్‌లో ఈడీ vs బెంగాల్ ప్రభుత్వం వార్ నడుస్తోంది. ఐ-ప్యాక్ సంస్థపై ఈడీ చేసిన దాడుల వ్యవహారంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఆదివారం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ కేసులో సీబీఐ దర్యాప్తు జరపాలని ఈడీ కోరుతోంది. ఇప్పటికే ఈ అంశంపై కలకత్తా హైకోర్టును కూడా ఈడీ ఆశ్రయించగా, ఆ పిటిషన్‌పై జనవరి 14న విచారణ జరగనుంది. హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో ఐ-ప్యాక్ డైరెక్టర్ ప్రతిక్ జైన్ ఇంట్లో జరిగిన సోదాల సమయంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తమ దర్యాప్తును అడ్డుకున్నారని ఈడీ ఆరోపించింది. కీలక పత్రాలను తమ కస్టడీ నుంచి తీసుకెళ్లారని, ఇందుకు రాష్ట్ర పోలీసులు సహకరించారని తెలిపింది. చట్టబద్ధంగా జరుగుతున్న తనిఖీలను అక్రమంగా అడ్డుకున్నారని పేర్కొంది. డిజిటల్ పరికరాలు, ఎలక్ట్రానిక్ డేటా, కీలక ఆధారాలు బలవంతంగా తీసుకెళ్లి దాచేశారని ఈడీ వాదించింది. అయితే ఈడీకి తక్షణ ఉపశమనం ఇవ్వడానికి కలకత్తా హైకోర్టు నిరాకరించింది.
ఇదిలా ఉండగా, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టులో క్యావియట్ దాఖలు చేసింది. తమ వాదనలు వినకుండా ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయవద్దని కోర్టును కోరింది. మరోవైపు, ఐ-ప్యాక్ సంస్థ ఈడీ దాడులను తీవ్రంగా ఖండించింది. చట్టానికి అనుగుణంగా పూర్తి సహకారం అందిస్తామని స్పష్టం చేసింది. తాము వృత్తిపరమైన నైతిక విలువలను పాటించామని, జరిగిన పరిణామాల వల్ల తమ పని మీద ప్రభావం పడదని ఐ-ప్యాక్ తెలిపింది. తమ సంస్థ ఎన్నికల్లో పోటీ చేయదని, రాజకీయ పదవులు చేపట్టదని, పారదర్శకంగా రాజకీయ కన్సల్టెన్సీ సేవలకే పరిమితమని స్పష్టంగా వెల్లడించింది.
అసలేంటీ ఈ వివాదం?
బంగాల్‌లోని ఈస్టర్న్ కోల్‌ఫీల్డ్ మైన్స్‌లో వందల కోట్ల రూపాయల విలువైన బొగ్గు దొంగతనానికి గురైనట్లు 2020లో సీబీఐ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. నగదు అక్రమ చలామణి జరిగినట్లు తేలడంతో ఈడీ రంగంలోకి దిగింది. స్థానిక వ్యాపారి అనూప్ మాఝీ (లాలా) ఇందులో ప్రధాన నిందితుడిగా గుర్తించింది. అయితే, ఇదే కేసులో తృణమూల్ ఎంపీ, మమత మేనల్లుడు అభిషేక్ బెనర్జీని గతంలోనే ఈడీ ప్రశ్నించింది. ఈ క్రమంలోనే కోల్‌కతాలోని సాల్ట్‌లేక్ ప్రాంతంలో ఉన్న ఐ-ప్యాక్ కార్యాలయంలో, దిల్లీలోని నాలుగు చోట్ల ఈడీ సోదాలు నిర్వహించింది. కొన్ని హవాలా లావాదేవీలు, నగదు వ్యవహారాలు ప్రతీక్ జైన్ ద్వారా జరిగినట్లు నిర్దిష్ట ఆధారాలు ఉన్నాయని ఈడీ ఆరోపిస్తోంది. బొగ్గు స్మగ్లింగ్ రాకెట్‌తో సంబంధం ఉన్న ఒక హవాలా ఆపరేటర్ ద్వారా ఐ-ప్యాక్‌కు చెందిన 'ఇండియన్ పీఏసీ కన్సల్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్‌కు రూ.కోట్లలో లావాదేవీలు జరిగాయని ఈడీ వర్గాలు తెలిపాయి. అయితే రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ నేతృత్వంలో ఆవిర్భవించిన ఐప్యాక్, బంగాల్లో తృణముల్ పార్టీ ఐటీ, ప్రచార బాధ్యతలను చూస్తోంది.