Al-Falah University: అల్-ఫలాహ్ వర్సిటీలో ఈడీ దాడులు..

25 చోట్ల ఏకకాలంలో సోదాలు

Update: 2025-11-18 03:30 GMT

ఢిల్లీ పేలుడు దర్యాప్తులో భాగంగా మంగళవారం ఉదయం ఫరీదాబాద్‌లోని అల్-ఫలాహ్ విశ్వవిద్యాలయంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ బృందాలు దాడులు చేస్తున్నాయి. యూనివర్సిటీ ప్రధాన కార్యాలయం, 25 ప్రదేశాలపై ఏకకాలంలో సోదాలు చేస్తున్నారు. జామియానగర్‌లో అల్-ఫలాహ్ సంస్థల వ్యవస్థాపకుడు ఇంట్లో కూడా సోదాలు చేస్తున్నారు. యూనివర్సిటీకి చెందిన నిధులపై దర్యాప్తు చేస్తున్నారు. ఫరీదాబాద్‌లో 70 ఎకరాల్లో విశ్వవిద్యాలయ క్యాంపస్ ఉంది. టెర్రర్ మాడ్యూల్‌లో ఉన్న ముగ్గురు డాక్టర్లు కూడా అల్‌-ఫలాహ్ నుంచే కార్యకలాపాలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఈడీ దాడులు చేస్తోంది.

విశ్వవిద్యాలయం నిధులపై దర్యాప్తు చేయాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావడంతో ఈడీ సోదాలకు దిగింది. విశ్వవిద్యాలయం ఖాతాలపై ఫోరెన్సిక్ ఆడిట్‌కు ఆదేశాలు జారీ అయ్యాయి. ఢిల్లీ పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్నారు. పేలుడు కేసును ఎన్‌ఐఏ దర్యాప్తు చేస్తుండగా.. తాజాగా ఆర్థిక లావాదేవీలను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు చేస్తోంది.

ఇప్పటికే విశ్వవిద్యాలయం సభ్యత్వం రద్దైంది. యూనివర్సిటీ మంచి స్థితిలో ఉన్నట్లు కనిపించడం లేదంటూ భారత విశ్వవిద్యాలయాల సంఘం సభ్యత్వాన్ని సస్పెండ్ చేసింది. అలాగే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్, నేషనల్ అసెస్‌మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్ ఇప్పటికే రెండు కేసులు నమోదు చేశాయి. మోసం, ఫోర్జరీ అభియోగాల కింద కేసులు నమోదు అయ్యాయి.

అల్-ఫలాహ్ విశ్వవిద్యాలయం 2014లో స్థాపించబడింది. మరుసటి సంవత్సరం యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ద్వారా గుర్తింపు పొందింది. ఈ యూనివర్సిటీ 1995లో అల్-ఫలాహ్ ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా స్థాపించింది. 1997లో ఇంజనీరింగ్ కళాశాలను ప్రారంభించింది. అనంతరం మెడికల్ కాలేజీగా మారింది. విశ్వవిద్యాలయంలో వైద్య శాస్త్రం, ఇంజనీరింగ్, సాంకేతికత, మానవీయ శాస్త్రాలు, కంప్యూటర్ సైన్స్ కోర్సులను అందించే పాఠశాలలు ఉన్నాయి.

ఫరీదాబాద్ నుంచి భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్న తర్వాత విశ్వవిద్యాలయం వెలుగులోకి వచ్చింది. అల్-ఫలా స్కూల్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ సెంటర్‌తో సంబంధం ఉన్న డాక్టర్ ముజమ్మిల్ క్యాంపస్ వెలుపల అద్దెకు తీసుకున్న గదుల్లో దాదాపు 2,900 కిలోల బాంబు తయారీ పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. మెడికల్ కాలేజీలోని మరో డాక్టర్ షాహీన్ కారులో అస్సాల్ట్ రైఫిల్స్, ఇతర ఆయుధాలు స్వాధీనం చేసుకున్నాక ఆమెను అరెస్టు చేశారు. ఈ వార్త వెలువడిన కొన్ని గంటల తర్వాత ఎర్రకోట సమీపంలో కారు పేలి 13 మంది మృతి చెందగా, 20 మందికి పైగా గాయపడ్డారు. కారు నడుపుతున్న వ్యక్తి డాక్టర్ ఉమర్ కూడా అల్-ఫలాహ్‌లో పనిచేశాడు. ఇతడు కూడా బ్లాస్ట్‌లో చనిపోయాడు.

యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ (డాక్టర్) భూపిందర్ కౌర్ ఆనంద్ మాట్లాడుతూ.. దురదృష్టకర పరిణామాలను ఖండిస్తున్నట్లు చెప్పారు. ఇద్దరు వైద్యులను దర్యాప్తు సంస్థలు అదుపులోకి తీసుకున్నాయని చెప్పారు. విశ్వవిద్యాలయంలో వైద్యులు అధికారిక హోదాలో పనిచేస్తున్నారు తప్ప, విశ్వవిద్యాలయానికి వారితో ఎటువంటి సంబంధం లేదన్నారు.

Tags:    

Similar News