Hemant Soren: సీఎం ఇంటికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు
మనీ లాండరింగ్ కేసులో విచారణ;
దేశ రాజధాని ఢిల్లీలోని జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ అధికార నివాసానికి ఎడ్ అధికారులు చేరుకున్నారు. మనీ లాండరింగ్ కేసులో విచారణను ఎదుర్కొంటున్న సోరెన్‌కు ఈ నెల 27న ఈడీ తొమ్మిదోసారి నోటీసులు జారీచేసిన విషయం తెలిసిందే. మరోసారి ఆయన స్టేట్‌మెంట్‌ను రికార్డు చేయాల్సి ఉందని.. జనవరి 29 లేదా 31 తేదీల్లో అందుబాటులో ఉండాలని అందులో పేర్కొన్నది. ఈ రెండు రోజుల్లో ఒకదానిని ఎంచుకోవాలని సూచించింది. అయితే ఈడీ నోటీసులకు సోరెన్ ఇప్పటివరకు స్పందించలేదు. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని ఆయన అధికార నివాసానికి అధికారులు చేరుకున్నారు.
మనీలాండరింగ్ కేసులో సీఎం సోరెన్‌ను రాచీలోని అధికార నివాసంలో ఈడీ అధికారులు ఈ నెల 20న సుదీర్ఘంగా ప్రశ్నించిన విషయం తెలిసిందే. ఆయన స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేశారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ని ముప్పుతిప్పలు పెట్టిన జార్ఖండ్ సీఎం హేమంత్ సొరేన్, ఈడీ పంపిన ఏడు సమన్లను ఆయన పట్టించుకోలేదు. తన అధికారిక కార్యక్రమాలను, ఇతరత్రా కారణాలను చెప్పి ఈడీ ముందుకు వచ్చేందుకు ఏడుసార్లు తప్పించుకున్నారు ఎనిమదో సారి ఇచ్చిన నోటీసులకు సానుకూలంగా స్పందించారు. పైగా ఈడీ ముందుకు ఆయన రాలేదు. జనవరి 20వ తేదీన తన అధికారిక నివాసానికే వచ్చి, స్టేట్‌మెంట్ రికార్డు చేసుకోవాలని అధికారులకు జార్ఖండ్ సీఎం సమాచారం ఇచ్చారు. దీంతో ల్యాండ్ స్కామ్ కేసులో దర్యాప్తులో భాగంగా ఈడీ అధికారులు ఆయన్ను ప్రశ్నించారు. మైనింగ్ స్కామ్‌లో రూ. 1,000కోట్ల కుంభకోణం జరిగిందని ఈడీ అభియోగాలు మోపింది. అయితే తనపై వచ్చిన ఆరోపణలను తోసిపుచ్చారు హేమంత్ సోరెన్. బీజేపీ కేంద్రం ఏజెన్సీలను దుర్వినియోగం చేస్తోందని మండిపడ్డారు.
జార్ఖండ్‌లో భూమి యాజమాన్యాన్ని అక్రమంగా మార్చే భారీ మాఫియాకు సంబంధించిన స్కామ్‌పై ఈడీ దర్యాప్తు చేస్తున్నది. అక్రమంగా మైనింగ్ లీజుల్లో ల్యాండ్ స్కాం జరిగిందని ఈడీ ఆరోపిస్తోంది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే 14 మందిని ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. 2011 బ్యాచ్ ఐఏఎస్ అధికారి, రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ డైరెక్టర్‌గా, రాంచీ డిప్యూటీ కమిషనర్‌గా పనిచేసిన రంజన్‌ను కూడా ఈ కేసులో అరెస్ట్ చేశారు.