PM Modi: ఢిల్లీ చేరుకున్న మోదీ.. ఉగ్రదాడిపై ఎయిర్‌పోర్టులో ఎమర్జెన్సీ భేటీ
కాసేపట్లో కేబినెట్ అత్యవసర భేటీ;
జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో పర్యటకులపై భీకర ఉగ్రదాడి నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన సౌదీ అరేబియా పర్యటనను కుదించుకొని హుటాహుటిన భారత్ చేరుకున్నారు. బుధవారం ఉదయం ఢిల్లీ ఎయిర్‌పోర్టులో దిగిన ప్రధాని మోదీ విమానాశ్రయంలోనే అత్యవసర సమావేశం నిర్వహించారు.
కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్, విదేశాంగశాఖ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీతో భేటీ అయి ఘటన గురించి చర్చించారు. దాడి తీరును వారు ప్రధానికి వివరించారు. ఇక, ఉదయం 11 గంటలకు ప్రధాని అధ్యక్షతన భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం కానుంది. ఇప్పటికే కేంద్ర హోంమంత్రి అమిత్ షా శ్రీనగర్‌కు చేరుకున్న సంగతి తెలిసిందే. భద్రతా సంస్థల ఉన్నతాధికారులతో సమావేశమై పరిస్థితులను సమీక్షించారు. నేడు ఆయన దాడి చోటుచేసుకున్న పహల్గాం ప్రాంతానికి వెళ్లి పరిశీలించనున్నారు.
కశ్మీర్‌లో మినీ స్విట్జర్లాండ్‌గా పేరొందిన పహల్గాం సమీప బైసరన్ లోయలో ఉగ్రవాదులు మంగళవారం భీకర దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. మధ్యాహ్నం 3 గంటల సమయంలో సైనిక దుస్తుల్లో వచ్చిన ముష్కరులు పర్యటకులను చుట్టుముట్టి.. అతి సమీపం నుంచి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 28 మంది ప్రాణాలు కోల్పోగా.. పదుల సంఖ్యలో గాయపడ్డారు. ఈ ఘటన అనంతరం అడవుల్లోకి పారిపోయిన ఉగ్రవాదుల కోసం భద్రతా బలగాలు ముమ్మర గాలింపుచర్యలు చేపట్టాయి.