Marco Ebben: మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ మార్కో ఎబ్బెన్ కాల్చివేత
మార్కో గతంలో 400 కిలోల కొకైన్‌ను స్మగ్లింగ్ చేసినట్లు ఆరోపణలు;
నెదర్లాండ్స్‌కు చెందిన డ్రగ్ ట్రాఫికర్.. యూరోప్ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్.. 32 ఏళ్ల మార్కో ఎబ్బెన్ మెక్సికోలో మర్డర్‌కు గురయ్యాడు. రాజధాని మెక్సికో సిటీకి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న అటిజాపన్ డీ జరగోజా మున్సిపాల్టీలో మార్కోను కాల్చి చంపినట్లు అధికారులు చెప్పారు. గత ఏడాది అతను మృతిచెందినట్లు ఓ ఫేక్ న్యూస్ వచ్చింది. అయితే ఈసారి ఎబ్బెన్ నిజంగానే హత్యకు గురైనట్లు పోలీసు ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. బ్రెజిల్ నుంచి నెదర్లాండ్స్‌కు డ్రగ్స్ సరఫరా చేస్తున్న క్రిమినల్స్ లిస్టులో మార్కో ఎబ్బెన్ మోస్ట్ వాంటెడ్‌గా ఉన్నాడు. యూరోపోల్ ఏజెన్సీ అతన్ని పట్టుకునేందుకు చాన్నాళ్లుగా ప్రయత్నిస్తున్నది. 2020 అక్టోబర్‌లో క్రిమినల్ మార్కోకు ఏడేళ్ల జైలుశిక్ష పడినట్లు యూరోపోల్ వెబ్‌సైట్ ద్వారా తెలుస్తోంది.
2014 నుంచి 2015 మధ్య కాలంలో.. సుమారు 400 కిలోల కొకైన్ మాదకద్రవ్యాన్ని స్మగ్లింగ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. పైన్‌యాపిల్స్‌తో నిండిన కంటేనర్లలో అతని ఆ కొకైన్ స్మగ్లింగ్ చేసినట్లు యూరోపోల్ పేర్కొన్నది. అయితే అరెస్టు నుంచి తప్పించుకునేందుకు అతను గత ఏడాది అక్టోబర్‌లో చనిపోయినట్లు ఫేక్ వార్తలను క్రియేట్ చేశాడు. మెక్సికోలో రెండు డ్రగ్స్ ముఠాల మధ్య జరిగిన ఫైరింగ్‌లో ప్రాణాలు కోల్పోయినట్లు నమ్మించే ప్రయత్నం చేశాడు. వాస్తవానికి ఓ పెద్ద కార్టల్‌తో అతనికి లింకులు ఉన్నా.. అతని మృతదేహాన్ని ఆ టైంలో గుర్తించ లేదు.