కళ్ళలో కళ్ళు పెట్టి చూడు.. అని రొమాంటిక్ పాట పాడుకొనే కాలం కాదిది.. ఇలా చూస్తే అలా చాలు అలా అంటుకొనే కళ్లకలక కాలం ఇది. దీనినే పింక్ ఐ అని కూడా అంటారు. వర్షాకాలంలో ఈ కండ్ల కలక ఇబ్బంది పెడుతుంది. ఈ సీజన్ లో గాలిలో తేమ ఎక్కువగా ఉండే కారణంగా, ఈ బ్యాక్టీరియా కళ్ళను ప్రభావితం చేస్తుంది.
ఊరు, పేరు, ఆడ, మగ, చిన్న, పెద్ద దేనితోని సంబంధం లేకుండా కళ్ళ కలగా కలవర పెడుతోంది. దేశవ్యాప్తంగా కండ్లకలక కేసులు నమోదయ్యాయి. ఇక ఢిల్లీలో గత ఏడాదితో పోలిస్తే మూడు నుంచి నాలుగు రెట్లు ఎక్కువ కేసులు నమోదయ్యాయి. ఎడతెగని వర్షాలు, తేమతో కూడిన వాతావరణం, కలుషిత నీరు... ఇవన్నీ కూడా బ్యాక్టీరియా వ్యాప్తి చెందేందుకు అనువైన పరిస్థితులను కల్పించాయి. వీటి వల్లే కంటి ఇన్ఫెక్షన్లు పెరిగిపోతున్నాయి. ఈ సమస్య వస్తే కళ్ళు ఎరుపుగా మారిపోతాయి. దురద కూడా పెడతాయి. తెల్లని పదార్థాన్ని స్రవిస్తాయి. కంటి నుంచి నీరు కారుతూ ఉంటుంది. కంటి రెప్పలు ఉబ్బిపోయే అవకాశం ఉంది. ఇది ఒక కంటికి వచ్చి రెండో కంటికి కూడా సోకవచ్చు. కళ్ళు వాచినట్టు అవుతాయి. ఇన్ఫెక్షన్ తీవ్రంగా ఉంటే వాపు, నొప్పి, తేలికపాటి జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
ఇక ఢిల్లీ విషయానికొస్తే అక్కడ రోజుకి 100కు పైగా కళ్ళగలుక కేసులు నమోదు అవుతున్నాయి. పాఠశాలలో విద్యార్థుల సంఖ్య బాగా తగ్గిపోయింది. ఢిల్లీలో ఫ్లూ, హెపటైటిస్ ఎ, ఇ వ్యాధులు ప్రబలుతున్నాయి. ఈ ఏడాది వాటి ప్రమాదం వేగంగా పెరుగుతుండడంతో ప్రజలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కానీ వాటిని అదుపు చేయలేకపోతున్నారు. ఈసారి వరదలే ఇందుకు కారణం. వరద నీటి కారణంగా యమునా, హిండన్ పరివాహాక ప్రాంతంలో ఉన్న కాలనీలు, సొసైటీలలోకి నీరు చేరుకుంది. చాలా చోట్ల క్రమంగా నీరు తగ్గడం ప్రారంభించింది. అయితే ఈ నీటి కారణంగా ప్రజలు అంటు వ్యాధులతో భయాందోళనలకు గురవుతున్నారు.
కండ్లకలక వచ్చినవారు కంటిని తరచూ మంచినీళ్లతో కడుక్కోవాలి. మిగతా వారికి దూరంగా ఉండటంతో పాటుగా తాము వాడిన వస్తువులను ఇతరులకు ఇవ్వకుండా జాగ్రత్త పడాలి. వ్యక్తిగత శుభ్రతను పాటించాలి. మురికి చేతులతో కళ్ళను తాకకుండా సబ్బు నీటితో తరచూ చేతులు కడుక్కోవాలి. కళ్లు దురదగా అనిపిస్తే పదే పదే రుద్దకూడదు. కళ్ళు తుడుచుకోవడానికి శుభ్రమైన కాటన్ క్లాత్ కానీ టిష్యూ పేపర్ ని కానీ వాడాలి. మెడికల్ షాప్ లో దొరికే ఆర్టిఫిషియల్ టియర్స్ ని వాడటం వల్ల ఫలితం ఉంటుంది. ఇలా కొన్ని సాధారణ జాగ్రత్తలు తీసుకుంటే కండ్ల కలక నుండి రిలీఫ్ పొందొచ్చు.