Lok Sabha Elections 2024 Phase: ముగిసిన తొలి దశ నామినేషన్ల గడువు

హోరెత్తుతున్న ప్ర‌చారం

Update: 2024-03-28 01:00 GMT

లోక్‌సభ ఎన్నికల తొలివిడతలో భాగంగా వచ్చే నెల 19న 102 స్థానాల్లో జరగనున్న పోలింగ్‌కు నామినేషన్ల గడువు ముగిసింది. మొదటి దశలో 17 రాష్ట్రాలు, 4 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 102 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. బీహార్‌లో మాత్రం నామినేషన్ల గడువు గురువారం ఉంది. ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్ర అభ్యర్థులు నామపత్రాలు దాఖలు చేశారు. కొందరు అభ్యర్థులు వినూత్న పద్ధతి నామినేషన్‌ దాఖలు చేశారు.ఎన్నికల సమరంలో ప్రధాన ఘట్టం ముగియడంతో పార్టీలు ప్రచారాన్ని మరింత ముమ్మరం చేశాయి.

దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల కోలాహలం నెలకొంది. మొత్తం ఎన్నికల ప్రక్రియ ఏడు దశల్లో జరగనుంది. మొదటి దశలో 17 రాష్ట్రాలు, 4 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 102 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. తొలి దశ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. తొలి దశలో ప్రధాన పార్టీలకు చెందిన పలువురు ప్రముఖులు నామపత్రాలు దాఖలు చేశారు. కొందరు ర్యాలీగా వెళ్లి నామినేషన్‌ వేయగా మరికొందరు ఎలాంటి ఆర్భాటాలు లేకుండా నామినేషన్ దాఖలు చేశారు.

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మహారాష్ట్రలోని నాగ్‌పుర్ నియోజకవర్గం నుంచి నామినేషన్ దాఖలు చేశారు. ఆయన వెంట మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ శిందే సహా పలువురు ముఖ్య నేతలున్నారు. ఇంటి నుంచి బయల్దేరే ముందు గడ్కరీకి ఆయన సతీమణి....విజయ తిలకం దిద్దారు. కుటుంబ సభ్యులతో కలిసి తన నివాసంలోనే గడ్కరీ పూజలు చేశారు. పూజల్లో మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్, ఎన్సీపీ నేత ప్రఫుల్ పటేల్ పాల్గొన్నారు. అనంతరం ర్యాలీగా బయల్దేరి వెళ్లి నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి సమర్పించారు.

తమిళనాడులోని మొత్తం 39 పార్లమెంట్ నియోజకవర్గాల్లో మొదటి దశలోనే పోలింగ్ జరగనుంది. రాజస్థాన్‌లో 12 సీట్లు, ఉత్తరప్రదేశ్‌లో 8, మధ్యప్రదేశ్‌లో 6, ఉత్తరాఖండ్‌లో 5, అసోంలో 5, మహారాష్ట్రల్లో5 లోక్‌సభ స్థానాల్లో నేటితో నామినేషన్ల ప్రక్రియ ముగుస్తుంది. బీహార్‌లో 4, పశ్చిమ బెంగాల్‌లో మూడు, అరుణాచల్ ప్రదేశ్‌లో 2, మణిపూర్‌లో 2, మేఘాలయలో 2, ఛత్తీస్‌గఢ్, మిజోరాం, నాగాలాండ్, సిక్కిం, త్రిపుర, అండమాన్ నికోబార్ దీవులు, జమ్మూ కాశ్మీర్, లక్షద్వీప్, పుదుచ్చేరిలో ఒక్కో స్థానానికి తొలి దశలో పోలింగ్ జరగనుంది. నామినేషన్ల ఉపసంహరణకు మార్చి 30 చివరి తేదీకాగా.... ఏప్రిల్ 19న 102 స్థానాల్లో పోలింగ్ జరగనుంది.

మొదటి దశ పోలింగ్ జరగనున్న నియోజకవర్గాల్లో ఎన్డీఏ, విపక్ష ఇండియా కూటముల అగ్ర నేతలు ముమ్మర ప్రచారం చేస్తున్నారు. ప్రధాని మోదీ, అమిత్‌ షా, నడ్డాలతో పాటు భాజపా పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు NDA తరపున పోటీచేస్తున్న అభ్యర్థుల ప్రచారంలో పాల్గొంటున్నారు. కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్, ప్రియాంక గాంధీ ఇండియా కూటమి తరపున ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొంటున్నారు.

Tags:    

Similar News