Gujarat: పరువు హత్యకు గురైన యువతికి నీట్‌లో మంచి ర్యాంక్!
వివాహితుడితో చంద్రిక సహజీవనం , జీర్ణించుకోలేక తండ్రి, బాబాయిలు కలిపి హత్య;
గుజరాత్‌లోని బనస్‌కాంతా జిల్లాలో పరువు హత్యకు గురైనట్టుగా భావిస్తున్న 18 ఏళ్ల చంద్రిక చౌదరి, ఇటీవల నిర్వహించిన నీట్ పరీక్షలో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించింది. భవిష్యత్తులో డాక్టర్ కావాలనుకున్న ఈ యువతిని ఆమె తండ్రి, ఇద్దరు బాబాయిలు హత్య చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి.
నీట్ కోచింగ్ కోసం పాలన్‌పుర్‌లోని ఒక హాస్టల్‌లో ఉన్న సమయంలో చంద్రిక.. వివాహితుడైన హరేశ్ చౌదరి అనే యువకుడితో ప్రేమలో పడి సహజీవనం ప్రారంభించింది. ఈ విషయం ఇంట్లో తెలియడంతో కుటుంబ సభ్యులు ఆమెను బలవంతంగా ఇంటికి తీసుకువచ్చి కట్టడి చేశారు. అదే సమయంలో ఒక పాత కేసులో హరేశ్‌ను పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు.
జూన్ 21న జైలు నుంచి విడుదలైన హరేశ్.. చంద్రిక ఆచూకీ కోసం గుజరాత్ హైకోర్టులో 'హెబియస్ కార్పస్' పిటిషన్ దాఖలు చేశాడు. ఈ పిటిషన్ జూన్ 27న విచారణకు రావాల్సి ఉంది. అయితే, అంతకు మూడు రోజుల ముందే, జూన్ 24న చంద్రిక మృతి చెందింది. మరుసటి రోజు ఉదయాన్నే కుటుంబ సభ్యులు హడావుడిగా ఆమె అంత్యక్రియలు కూడా పూర్తి చేశారు.
"ఆమెకు పాలలో నిద్రమాత్రలు కలిపి ఇచ్చారు. నిద్రలోకి జారుకున్నాక గొంతు నులిమి చంపారు" అని ఏఎస్పీ వివరించారు. హరేశ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో నిందితులైన ఇద్దరిని అరెస్టు చేశామని, పరారీలో ఉన్న మూడో వ్యక్తి కోసం గాలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. ఈ కేసుపై దర్యాప్తు కొనసాగుతోందని అన్నారు.