Google Maps: గూగుల్ మ్యాప్స్‌ను నమ్మి నదిలో కొట్టుకుపోయిన ఫ్యామిలీ

ఒకరు మృతి, ముగ్గురు గల్లంతు!;

Update: 2025-08-28 00:24 GMT

చిత్తోర్‌గఢ్ జిల్లాలో ఒక భారీ ప్రమాదం జరిగింది. రాజ్‌సమంద్ జిల్లాలోని గదరి వర్గానికి చెందిన ఒక కుటుంబం గూగుల్ మ్యాప్‌పై ఆధారపడి తిరిగి వస్తుండగా బనాస్ నదిలో కొట్టుకుపోయారు. వ్యాన్‌లో ఉన్న తొమ్మిది మందిలో ఐదుగురిని గ్రామస్తుల సాయంతో పోలీసులు రక్షించారు. ఈ ఘటనలో ఒక బాలిక మరణించింది. మరో ముగ్గురి కోసం గాలిస్తున్నారు. రష్మి పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని సోమి-ఉప్రెడా కల్వర్టు వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఈ కల్వర్టు మూడు సంవత్సరాలుగా మూసివేసి ఉంది. అయితే భారీ వర్షాల కారణంగా దానిపై నీరు ప్రవహిస్తోంది. ఇది గమనించకుండా వెళ్లిన వాహనం ప్రమాదానికి గురైనట్లు పోలీసులు తెలిపారు.

కనఖేడాకు చెందిన ఈ కుటుంబం భిల్వారా జిల్లాలోని సవాయి భోజ్‌ను సందర్శించడానికి వెళ్ళింది. తిరిగి వచ్చే క్రమంలో వారు గూగుల్ మ్యాప్ ద్వారా ఇంటికి తిరిగి వెళ్ళే మార్గాన్ని సెర్చ్ చేశారు. ఆ మ్యాప్ వారిని సోమి-ఉప్రెడా కల్వర్ట్ వైపు మళ్లించింది. అది చాలా రోజులుగా మూసివేసిన మార్గాన్ని సూచించింది. పొరబడిన డ్రైవర్ వ్యాన్‌ను కల్వర్ట్‌ మీదుగా తీసుకెళ్లాడు. అక్కడ వ్యాన్ ఒక గొయ్యిలో చిక్కుకుంది. ఇంతలోనే వేగంగా వచ్చిన ప్రవాహానికి వ్యాను కొట్టుకుపోయింది. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. గ్రామస్తులు, సహాయక బృందాలు పడవల సహాయంతో ఐదుగురిని రక్షించారు. వ్యాన్‌లో ఉన్న తొమ్మిది మంది బంధువులు గదరి వర్గానికి చెందినవారని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదం తర్వాత గూగుల్ మ్యాప్స్‌పై గుడ్డి నమ్మకం పెట్టుకోవద్దని పలువురు సూచిస్తున్నారు.

Tags:    

Similar News