Haryana Govt : ‘గుడ్ మార్నింగ్’ బదులు ‘జైహింద్’
స్వాతంత్య్ర దినోత్సవం నుంచి హర్యానా స్కూళ్లలో అమలు;
స్వాతంత్య్ర దినోత్సవం ఆగస్టు 15 నుంచి అన్ని పాఠశాలల్లోని విద్యార్థులు.. టీచర్లకు తోటి స్నేహితులకు గుడ్ మార్నింగ్‌కు బదులుగా జైహింద్ చెప్పాలని హరియాణా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు గురువారం ఆ రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు పాఠశాల విద్యా డైరెక్టరేట్ జీవో జారీ చేసింది. ‘‘ప్రతిరోజు జైహింద్ చెప్పడం వల్ల విద్యార్థులకు చిన్నప్పటి నుంచే దేశ భక్తి పెరుగుతుంది’’ అని జీవోలో పేర్కొంది.
ఈ ఏడాది స్వాతంత్య్ర దినోత్సవం నుంచి హర్యానాలోని పాఠశాలల్లో ‘గుడ్ మార్నింగ్’ బదులు ‘జై హింద్’ చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. విద్యార్థుల్లో దేశభక్తి, జాతీయభావాన్ని పెంపొందించేందుకు ఈ చర్య చేపట్టినట్టు తెలిపింది. దేశ స్వాతంత్య్ర సమరంలో సుభాష్ చంద్రబోస్ ఇచ్చిన జై హింద్ పిలుపును ఆ తర్వాతి కాలంలో సైనిక దళాలు నమస్కారంగా(సెల్యూట్) స్వీకరించాయని పాఠశాల విద్యా విభాగం తెలిపింది. గుడ్ మార్నింగ్ బదులు జై హింద్ అనడం వల్ల విద్యార్థులు ప్రతి రోజూ జాతీయ సమైక్యతతో స్ఫూర్తి పొందుతారని, దేశ ఘన చరిత్రను గౌరవిస్తారని వెల్లడించింది. ‘దేశ అభివృద్ధికి కృషి చేసేలా యువ భారతీయులకు ‘జై హింద్’ స్ఫూర్తి కలిగిస్తుంది’ అని ఉత్తర్వుల్లో పేర్కొన్నది.