Helicopter Crash: ఎన్నికల వేళ కుప్పకూలిన హెలికాప్టర్.
శివసేన నేత సుష్మా అధారేకు తప్పిన ప్రమాదం;
మహారాష్ట్ర రాయ్ గఢ్ జిల్లాలో ప్రముఖ రాజకీయ నేతను తీసుకెళ్లేందుకు వచ్చిన హెలికాప్టర్ కుప్పకూలింది. శివసేన కీలక నాయకురాలు సుష్మా అంధారేను తీసుకెళ్లేందుకు వచ్చిన ఓ ప్రైవేట్ హెలికాప్టర్ ల్యాండింగ్ సమయంలో అదుపు తప్పి అకస్మాత్తుగా కూలినట్లు పోలీసులు తెలిపారు. మైదానంలో భారీగా దుమ్మురేపుతూ పెద్ద శబ్దంతో హెలికాప్టర్ నేలకూలినట్లు చెప్పారు. ప్రమాదం ముందే పసిగట్టిన పైలెట్ బయటకి దూకి ప్రాణాలు కాపాడుకున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలో ఎన్నికల ప్రచారం కోసం సుష్మా అంధారే ఆ హెలికాప్టర్ లో వెళ్లాల్సిన ఉండగా....ఈ ప్రమాదం జరగడంతో ఆమె అక్కడి నుంచి ఎన్నికల ప్రచారానికి కారులో వెళ్లారు.
మహారాష్ట్రలోని రాయ్‌గఢ్ జిల్లాలోని మహద్ పట్టణంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఉద్ధవ్ ఠాక్రే శివసేన పార్టీకి చెందిన సుష్మా అంధారేను తీసుకెళ్లేందుకు వచ్చిన ఓ ప్రైవేట్ హెలికాప్టర్‌ను.. ఓపెన్ గ్రౌండ్‌లో ల్యాండింగ్ చేస్తుండగా.. అకస్మాత్తుగా కూలిపోయిందని అధికారులు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించి హెలికాప్టర్ కూలిపోతున్న దృశ్యాలను సుష్మా అంధారే సోషల్ మీడియాలో షేర్ చేయడంతో తెగ వైరల్ అవుతున్నాయి. హెలికాప్టర్ కూలిపోవడంతో ఆ ప్రాంతం మొత్తం పెద్ద ఎత్తున ధూళి వ్యాపించింది. ఆ సమయంలో భారీ శబ్దం వచ్చినట్లు స్థానికులు తెలిపారు.
సుష్మ అంధారే గురువారం మహాద్లో ఎన్నికల ర్యాలీ నిర్వహించారు. శుక్రవారం బారామతిలో జరగనున్న మరో ర్యాలీకి ఆమె వెళ్లాల్సి ఉంది. తీవ్రమైన ఎండల కారణంగా రోడ్డు మార్గంలో వెళ్లలేక హెలికాప్టర్లో ప్రయాణించాలని అనుకున్నారు. అందుకు గాను హెలికాప్టర్‌ను రప్పించారు. మహాద్ మైదానంలో హెలికాప్టర్ ఎక్కేందుకు సుష్మ సిద్ధంగా ఉన్నారు. చాలా సేపు ఎదురుచూసినా హెలికాప్టర్ కిందకి రాలేదు.
ఆ తర్వాత కొద్దిసేపటికే హెలికాప్టర్‌ను ల్యాండ్ చేసేందుకు రెండు రౌండ్లు వేశారు పైలట్. కానీ ప్రమాదవశాత్తు హెలికాప్టర్ ఒక్కసారిగా కూలిపోయింది. భారీ శబ్దం వచ్చింది. దీంతో స్థానికులంతా భయాందోళనకు గురయ్యారు.ఈ ఘటనపై అధికారులు విచారణ జరుపుతారని సుష్మ అంధారే తెలిపారు.
హెలికాప్టర్ కూలిపోయిందన్న సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు వెంటనే సంఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ప్రమాదస్థలిని పరిశీలించి.. హెలికాప్టర్ కూలిపోవడానికి గల కారణాలు తెలుసుకున్నారు. ఈ ఘటన తర్వాత సుష్మా అంధారే.. హెలికాప్టర్ ప్రయాణాన్ని రద్దు చేసుకుని.. కారులో ప్రచారానికి వెళ్లిపోయారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.