HINDENBURG: దేశంలో మళ్లీ హిండెనబర్గ్‌ కలకలం

అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం... జేపీసీకి ప్రతిపక్షాల డిమాండ్‌;

Update: 2024-08-12 03:00 GMT

దేశంలో హిండెన్‌బర్గ్‌ నివేదిక మరోసారి కలకలం రేపింది. అదానీ కంపెనీల షేర్ల విలువ పెరగడానికి సహకరించిన విదేశీ ఫండ్లలో సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్ఛేంజ్‌ బోర్డు ఆఫ్‌ ఇండియా ఛైర్‌పర్సన్‌ మాధబి పురి బచ్‌ పెట్టుబడులు పెట్టారని హిండెన్‌బర్గ్‌ చేసిన ఆరోపణలు అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర విమర్శల యుద్ధానికి దారితీశాయి. మాధబి బిచి వెంటనే వైదొలగాలని, విచారణకు పార్లమెంట్‌ జేపీసీ వేయాలని విపక్షాలు డిమాండు చేయగా.. అసలు దేశంలో ఆర్థిక అస్థిరతకు కాంగ్రెస్‌తోపాటు ప్రతిపక్షాలు కారణమని బీజేపీ విమర్శించింది. దీంతో మరోసారి హిండెన్‌బర్గ్‌ కలకలం రేగింది. అదానీ కంపెనీల్లో అవకతవకలు జరిగాయని గతంలోనూ ఆ సంస్థ ఆరోపించడంతో తీవ్ర సంచలనం సృష్టించింది.

హిండెన్‌బర్గ్‌ ఆరోపణల నేపథ్యంలో మొత్తం వ్యవహారంపై విచారణ జరిపేందుకు జేపీసీ వేయాలని కాంగ్రెస్‌ డిమాండు చేసింది. ఈ కుంభకోణాన్ని సుమోటోగా తీసుకుని విచారణ జరపాలని సుప్రీంకోర్టును కోరింది. తీవ్ర ఆరోపణల నేపథ్యంలో బచ్‌ పదవి నుంచి వైదొలగాలని డిమాండు చేసింది. ‘స్టాక్‌ మార్కెట్లో పెట్టిన చిన్న, మధ్యతరగతి పెట్టుబడిదారుల కష్టార్జితం ప్రస్తుతం ప్రమాదంలో పడిందని... మార్కెట్‌ను రక్షించాల్సిన అవసరముందని... ఈ అతి పెద్ద కుంభకోణంపై జేపీసీతో విచారణ జరిపించాలని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే డిమాండు చేశారు. హిండెన్‌బర్గ్‌ ఆరోపణలతో సెబీ విశ్వసనీయత ఘోరంగా దెబ్బ తిందని రాహుల్‌గాంధీ అన్నారు. సెబీ ఛైర్‌ పర్సన్‌ ఇంకా ఎందుకు రాజీనామా చేయలేదని సగటు ఇన్వెస్టరు అడుగుతున్నారని.... వారు స్టాక్‌ మార్కెట్లో నష్టపోతే ఎవరు బాధ్యత వహిస్తారని రాహుల్‌ అన్నారు. ప్రధాని మోదీ బాధ్యత తీసుకుంటారా.. అదానీ తీసుకుంటారా.. సెబీ ఛైర్‌ పర్సనా’ అని లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ నిలదీశారు

మాధుభి బచ్, ఆమె భర్త.. బెర్ముడా, మారిషస్‌ కేంద్రంగా పనిచేసే ఫండ్లలో పెట్టుబడి పెట్టారు. వాటిలోనే వినోద్‌ అదానీ, ఆయన సన్నిహితులు చాంగ్‌ చుంగ్‌-లింగ్, నాజర్‌ అలీలు పెట్టుబడి పెట్టారు. ఆ ఫండ్లే అదానీ కంపెనీల్లో భారీగా షేర్లు కొన్నాయి. ఇది సెబీ నిబంధనలను ఉల్లంఘించడమే. 2022లో బచ్‌ ఛైర్‌ పర్సన్‌ కాగానే గౌతం అదానీ రెండుసార్లు ఆమెతో భేటీ కావడం ఇప్పుడు పలు ప్రశ్నలను లేవనెత్తుతోంది’ అని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ పేర్కొన్నారుహిండెన్‌బర్గ్‌ ఆరోపణలను సుప్రీంకోర్టు పరి గణనలోకి తీసుకోవాలని ఆమ్‌ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్‌ సింగ్‌ డిమాండు చేశారు.

సెబీలాంటి ఆర్థిక సంస్థను దెబ్బతీయడానికే విపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయని బీజేపీ ఆరోపించింది.  కాంగ్రెస్‌తో భాగస్వామ్యమున్న హిండెన్‌బర్గ్‌ దురుద్దేశపూర్వకంగా ఒక లక్ష్యంతో ఈ ఆరోపణలు చేస్తోందని బీజేపీ నేత రాజీవ్‌ చంద్రశేఖర్‌ విమర్శించారు. ఇన్వెస్టర్ల బుల్లిష్‌ సెంటిమెంటును దెబ్బతీయడానికి కాంగ్రెస్‌ ప్రయత్నిస్తోందని ఆరోపించారు.

Tags:    

Similar News