Termination Notice: సీఈఓ సహా 300 మంది ఉద్యోగులకు తొలగింపు మెయిల్స్.. హెచ్‌ఆర్ పొరపాటు .. ఉద్యోగుల్లో ఆందోళన,

రెడ్డిట్‌లో ఓ ఉద్యోగి పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారిన ఘటన

Update: 2025-11-11 06:45 GMT

ప్రస్తుతం అంతటా లేఆఫ్‌ల కలకలం రేగుతున్న తరుణంలో, ఓ కంపెనీ హెచ్‌ఆర్ విభాగం చేసిన చిన్న పొరపాటు పెద్ద గందరగోళానికి దారితీసింది. కొత్త ఆటోమేషన్ సాఫ్ట్‌వేర్‌ను పరీక్షిస్తూ, ఏకంగా కంపెనీ సీఈఓ సహా ఉద్యోగులందరికీ 'ఉద్యోగం నుంచి తొలగిస్తున్నాం' అంటూ ఈ-మెయిల్స్ పంపింది. ఈ ఘటన ఉద్యోగుల్లో తీవ్ర భయాందోళనలకు కారణం కాగా, సోషల్ మీడియాలో మాత్రం నవ్వులు పూయిస్తోంది.

వివరాల్లోకి వెళ్తే, ఓ కంపెనీలో ఉద్యోగుల రాజీనామా లేదా తొలగింపు ప్రక్రియను సులభతరం చేసేందుకు హెచ్‌ఆర్ విభాగం కొత్త 'ఆఫ్‌బోర్డింగ్' సాఫ్ట్‌వేర్‌ను పరీక్షిస్తోంది. అయితే, సిస్టమ్‌ను 'టెస్ట్ మోడ్' నుంచి 'లైవ్ మోడ్'కు మార్చి, తిరిగి మార్చడం మర్చిపోయారు. దీంతో ఆ సంస్థలో పనిచేస్తున్న సుమారు 300 మంది ఉద్యోగులకు 'వెంటనే అమలులోకి వచ్చేలా ఇదే మీ చివరి పని దినం' అనే సందేశంతో ఈ-మెయిల్స్ వెళ్లాయి.

ఈ ఊహించని మెయిల్‌తో ఉద్యోగులంతా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఓ మేనేజర్ అయితే, 'నేను నా వస్తువులు సర్దుకోవడం ప్రారంభించాలా?' అని సరదాగా రిప్లై ఇచ్చారు. ఈ ఘటనను ఓ ఉద్యోగి రెడ్డిట్‌లో పోస్ట్ చేయడంతో విషయం వైరల్‌గా మారింది. గందరగోళాన్ని గమనించిన ఐటీ విభాగం వెంటనే రంగంలోకి దిగింది. 'ఎవరినీ ఉద్యోగం నుంచి తొలగించలేదు. దయచేసి మీ బ్యాడ్జ్‌లను తిరిగి ఇవ్వకండి' అంటూ అత్యవసర సందేశం పంపింది. హెచ్‌ఆర్ విభాగం కూడా తమ పొరపాటును అంగీకరిస్తూ, ఆటోమేషన్ టూల్ వల్ల ఇది జరిగిందని, కంగారు పడవద్దని ఉద్యోగులకు స్పష్టం చేసింది.

ఈ ఘటనపై సోషల్ మీడియాలో నెటిజన్లు ఫన్నీగా స్పందిస్తున్నారు. 'ఇలాంటి సమయంలో నన్ను తొలగిస్తే, మూడు నెలల జీతం వస్తుంది, వెంటనే పని మానేయవచ్చు. అదృష్టం అంటే ఇదే' అని ఒకరు కామెంట్ చేయగా, 'నన్ను ఉద్యోగం నుంచి తీసేంత తెలివితక్కువ కంపెనీలో నేను పనిచేయాలనుకోను' అంటూ మరొకరు చమత్కరించారు. మొత్తానికి, ఈ హెచ్‌ఆర్ పొరపాటు ఇప్పుడు ఇంటర్నెట్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

Tags:    

Similar News