Uttarakhand Landslide: రుద్రప్రయాగ్‌లో కొండచరియలు విరిగిపడి.. ఒకరు మృతి

ముమ్మరంగా సహాయక చర్యలు..;

Update: 2024-09-10 03:30 GMT

ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తూనే ఉన్నాయి. దీంతో కొండచరియలు విరిగిపడే సంఘటనలు తరుచుగా జరుగుతున్నాయి. దీంతో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ట్రాఫిక్‌కు కూడా భారీగా అంతరాయం ఏర్పడుతోంది. తాజాగా, సోన్‌ప్రయాగ్ – గౌరీకుండ్ మధ్య కొండపై నుండి శిధిలాలు పడటంతో ఒకరు మరణించారు. అలాగే ఇద్దరు గాయపడ్డారు. గాయపడ్డ క్షతగాత్రులను ఆస్పత్రిలో చేర్పించారు.

జిల్లా విపత్తు నిర్వహణ అధికారి నందన్ సింగ్ రాజ్వార్ మాట్లాడుతూ.. సోమవారం రాత్రి 7:20 గంటలకు సోన్‌ప్రయాగ్, ముంకతీయ మధ్య రహదారిపై పర్వతం నుండి శిధిలాల కారణంగా కొంతమంది ప్రయాణికులు సమాధి అయ్యారని సోన్‌ ప్రయాగ్ పోలీస్ స్టేషన్ నుండి సమాచారం అందింది. సమాచారం అందిన వెంటనే ఎస్‌డిఆర్‌ఎఫ్‌, ఎన్‌డిఆర్‌ఎఫ్‌, సెక్టార్‌ మెజిస్ట్రేట్‌ లను సంఘటనా స్థలానికి పంపారు. ఘటనా స్థలానికి చేరుకున్న రెస్క్యూ టీం సహాయక చర్యలు చేపట్టింది. శిథిలాల పడి ఒకరు మృతి చెందగా, గాయపడిన ఇద్దరు వ్యక్తులను బయటకు తీశారు. వారిని అంబులెన్స్‌లో సోన్‌ ప్రయాగ్‌ ఆస్పత్రికి తరలించారు. రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది. చీకటి, వర్షం కారణంగా రెస్క్యూ ఆపరేషన్‌ కు ఇబ్బందులు ఎదురవుతున్నప్పటికీ ప్రతికూల పరిస్థితుల్లోనూ రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యల్లో నిమగ్నమై ఉన్నారు. ఘటనా స్థలంలో కృత్రిమ లైటింగ్‌ ఏర్పాటు చేశారు.

2 రోజులుగా ఉత్తరాఖండ్ పర్వతాల్లో భారీ వర్షాలు కురుస్తుంది. దీని కారణంగా.. పర్వతాల నుండి కొండచరియలు విరిగిపడే సంఘటనలు జరుగుతుండగా, నదులు కూడా ఉప్పొంగుతున్నాయి. దీంతో రాష్ట్రంలో రోజురోజుకూ ప్రాణ, ఆస్తి నష్టం జరుగుతోంది. అయితే అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారని ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అయినా కానీ ఇప్పటికీ కొన్ని సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి.

Tags:    

Similar News