INDIA parties: పార్లమెంట్ ఆవరణలో ఇండియా కూటమి నేతల నిరసన
‘కుర్సీ బచావో బడ్జెట్ 'అన్న రాహుల్ గాంధీ;
కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టిన బడ్జెట్ పై ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు కేంద్ర బడ్జెట్‌కు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. బుధవారం ఉదయం సమావేశాలకు ముందు కూటమి పార్టీలకు చెందిన ఎంపీలంతా పార్లమెంట్ వద్దకు చేరుకొని ఆందోళన చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు ప్రవేశ పెట్టిన బడ్జెట్ ఇది అని ఆరోపించారు.
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ సహా కూటమి పార్టీల నేతలంతా నిరసన తెలిపారు. కేంద్ర బడ్జెట్‌లో చాలా మందికి అన్యాయం జరిగిందని ఈ సందర్భంగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. ‘ఇది అన్యాయం. న్యాయం కోసం దీనిపై మేము పోరాడుతాం’ అని తెలిపారు. ఈ మేరకు నేతలంతా ఫ్లకార్డులను ప్రదర్శిస్తూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
కేంద్ర బడ్జెట్‌లో ప్రతిపక్షాల పాలిత రాష్ట్రాలపై వివక్ష చూపించారని పార్లమెంట్‌లో, వెలుపల నిరసన తెలియజేయాలని ఇండియా బ్లాక్ పార్టీలు మంగళవారం రాత్రే నిర్ణయించాయి. మంగళవారం రాత్రి 10 గంటలకు రాజాజీ మార్గ్‌లో కాంగ్రెస్ అధ్యక్షుడు, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే నివాసంలో జరిగిన ఇండియా బ్లాక్ పార్టీల ఫ్లోర్ లీడర్‌ల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, రాజ్యసభలో కాంగ్రెస్ ఉపనేత ప్రమోద్ తివారీ, లోక్‌సభలో కాంగ్రెస్ ఉపనేత గౌరవ్ గొగోయ్, ఎన్సీపీ (ఎస్‌సీపీ) అధినేత శరద్ పవార్, శివసేన (యూబీటీ) నాయకుడు సంజయ్ రౌత్ , ఈ సమావేశంలో టిఎంసి నాయకులు డెరెక్ ఓబ్రెయిన్, కళ్యాణ్ బెనర్జీ, డిఎంకె టిఆర్ బాలు, జెఎంఎం మహువా మాజీ, ఆప్ నుండి రాఘవ్ చద్దా, సంజయ్ సింగ్, సిపిఐ(ఎం) జాన్ బ్రిట్టాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శులు కెసి వేణుగోపాల్, జైరాం రమేష్ కూడా పాల్గొన్నారు.