Drugs: అరేబియా సముద్రంలో 500 కిలోల డ్రగ్స్ సీజ్
భారత్, శ్రీలంక సంయుక్త ఆపరేషన్;
అరేబియా సముద్రంలో భారీగా మాదకద్రవ్యాలు పట్టుబడ్డాయి. భారత్, శ్రీలంక నేవీలు సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్‌లో రెండు చేపల వేట పడవల నుంచి 500 కిలోల క్రిస్టల్ మెథాంఫెటమిన్‌ను స్వాధీనం చేసుకొని సీజ్ చేశారు. శ్రీలంక జెండాలతో ప్రయాణిస్తున్న రెండు పడవలపై శ్రీలంక నేవీ నుంచి వచ్చిన సమాచారం ఆధారంగా ఇరు దేశాల నేవీలు జాయింట్ ఆపరేషన్ చేపట్టినట్టు భారత నేవీ ప్రకటించింది. న్యాయపరమైన చర్యల కోసం పట్టుబడిన డ్రగ్స్, పడవలు, వాటిలోని సిబ్బందిని శ్రీలంకకు అప్పగించినట్టు వెల్లడించింది.
62 దేశాల ఆపరేషన్.. 1,400 టన్నుల డ్రగ్స్ పట్టివేత
62 దేశాలు కలిసి చేపట్టిన ‘ఆపరేషన్ ఓరియన్’లో భారీగా మత్తు పదార్థాలు దొరికాయి. ఆరు వారాల పాటు చేపట్టిన ఈ భారీ ఆపరేషన్‌లో 225 టన్నుల కొకైన్, 1000 టన్నుల మరిజువానాను కొలంబియా సహా వివిధ దేశాల నౌకా దళాలు సీజ్ చేశాయి. ఇంత భారీ ఎత్తున కొకైన్ పట్టుబడటం ఇదే మొదటిసారి. డ్రగ్స్ ను అక్రమ రవాణా చేస్తున్న ఆరు జలా ంతర్గాములను సీజ్ చేశారు. డ్రగ్స్ రవాణాతో సంబంధమున్న 400 మందిని అరెస్టు చేశారు. దక్షిణ అమెరికా నుంచి ఆస్ట్రేలియాకు డ్రగ్స్‌ను అక్రమ రవాణా చేస్తున్న కొత్త పసిఫిక్ సముద్ర దారిని ఈ ఆపరేషన్‌లో గుర్తించినట్టు కొలంబియా నేవీ వెల్లడించింది.