Kerala High Court: పెండ్లిలో పెట్టిన బంగారం భార్యకే

విడాకుల కేసులో కేరళ హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు;

Update: 2025-05-02 01:30 GMT

వివాహ సమయంలో వధువుకు బహుమతిగా ఇచ్చే బంగారం, నగలు పూర్తిగా ఆమెకే చెందుతాయని, అది ఆమె స్త్రీధనంగా పరిగణించాలని కేరళ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఓ విడాకుల కేసులో దాఖలైన అప్పీల్‌ను విచారించిన న్యాయస్థానం, పెళ్లి సమయంలో వధువుకు ఇచ్చే బంగారాన్ని ఆమె ప్రత్యేక ఆస్తిగా గుర్తించాలని స్పష్టం చేసింది. భద్రపరుస్తామనే నెపంతో భర్త లేదా అత్తింటివారు ఆ బంగారాన్ని తమ వద్ద ఉంచుకున్నప్పటికీ, దానిపై పూర్తి హక్కు వధువుకే ఉంటుందని తేల్చి చెప్పింది.

ఎర్నాకుళం జిల్లా కలమస్సేరికి చెందిన ఓ మహిళకు 2010లో వివాహమైంది. ఆ సమయంలో తన తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కలిసి తనకు 71 సవర్ల బంగారాన్ని బహుమతిగా ఇచ్చారని ఆమె కోర్టుకు తెలిపారు. అయితే, మంగళసూత్రం, కొన్ని గాజులు, ఉంగరాలు మినహా మిగిలిన బంగారాన్నంతా భద్రంగా దాస్తామంటూ అత్తింటివారే తీసుకున్నారని ఆమె ఆరోపించారు. ఆ తర్వాత అదనపు కట్నం కింద రూ.5 లక్షలు తేవాలని భర్త వేధించడంతో ఇరు కుటుంబాల మధ్య విభేదాలు తలెత్తి, విడాకుల వరకు దారితీశాయని ఆమె వాపోయారు. తన తల్లిదండ్రులు ఫిక్స్‌డ్ డిపాజిట్ల ద్వారా ఆ బంగారాన్ని కొనుగోలు చేశారనడానికి తగిన ఆధారాలను ఆమె కోర్టు ముందుంచగలిగారు.

ఈ కేసును మొదట విచారించిన ఫ్యామిలీ కోర్టు, ఆమె తన బంగారాన్ని తిరిగి ఇప్పించాలన్న అభ్యర్థనను తిరస్కరించింది. దీంతో ఆమె కేరళ హైకోర్టును ఆశ్రయించారు. వాదోపవాదాలు విన్న హైకోర్టు... ఫ్యామిలీ కోర్టు తీర్పును పక్కనపెట్టింది. ఆమెకు చెందిన మిగిలిన 59.5 సవర్ల బంగారాన్ని కానీ, లేదా దాని ప్రస్తుత మార్కెట్ విలువకు సమానమైన నగదును కానీ పిటిషనర్‌కు చెల్లించాలని భర్త కుటుంబాన్ని ఆదేశిస్తూ తీర్పునిచ్చింది.

అయితే, వివాహ సమయంలో బంధువులు పెట్టిన బంగారం, గృహోపకరణాలకు సంబంధించి సరైన ఆధారాలు సమర్పించలేకపోవడంతో, ఆ మేరకు ఆమె చేసిన క్లెయిమ్‌ను హైకోర్టు పరిగణనలోకి తీసుకోలేదు. ఈ సందర్భంగా కేరళ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. "సాధారణంగా వివాహ సమయంలో వధువుకు ఇచ్చే బంగారాన్ని భద్రత పేరుతో లేదా ఆచారాల ప్రకారం భర్త లేదా అత్తింటివారు తమ అధీనంలో ఉంచుకుంటారు. ఈ బదిలీకి రాతపూర్వక ఒప్పందాలు ఉండవు. గృహహింస, వరకట్న వేధింపులు లేదా విడాకులు వంటివి తలెత్తినప్పుడు ఆ బంగారాన్ని తిరిగి పొందడం మహిళలకు సంక్లిష్టంగా మారుతుంది. ఎలాంటి రసీదులు లేకపోవడం వల్ల ఆ బంగారం తనదేనని నిరూపించుకోవడం కష్టమవుతుంది. ఇలాంటి పరిస్థితులను న్యాయస్థానాలు మానవతా దృక్పథంతో అర్థం చేసుకోవాలి. క్రిమినల్ కేసుల్లో మాదిరిగా కఠినమైన చట్టపరమైన సాక్ష్యాధారాలు కావాలని పట్టుబట్టలేం" అని కోర్టు అభిప్రాయపడింది. స్త్రీధనం విషయంలో మహిళల హక్కులను కాపాడాల్సిన బాధ్యత న్యాయవ్యవస్థపై ఉందని పరోక్షంగా సూచించింది.

Tags:    

Similar News