భారత వాయుసేన కీలక నిర్ణయం..మిగ్- 21 ఫైటర్ జెట్‌లు నిలిపివేత
మిగ్- 21 యుద్ధ విమానాల కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రకటించింది;
భారత వాయుసేన కీలక నిర్ణయం తీసుకుంది. మిగ్- 21 యుద్ధ విమానాల కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రకటించింది. ఇటీవల ఓ మిగ్- 21 యుద్ధ విమానం రాజస్థాన్‌లోని ఓ ఇంటిపై ప్రమాదవశాత్తూ కుప్పకూలిన ఘటనలో ముగ్గురు పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదం వెనుక కారణాలను వెలికితీయడంతో పాటు మిగ్- 21 యుద్ధ విమానాలను పూర్తిస్థాయిలో పరిశీలించి లోపాలను నిర్ధారించే వరకు వాటిని నిలిపేయాలని భారత వాయుసేన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వాయుసేనకు చెందిన మిగ్ యుద్ధ విమానాలు తరచూ ప్రమాదాలకు గురవుతూ వార్తల్లో నిలుస్తున్నాయి.
1960ల్లో భారత వాయుసేనలో మిగ్ యుద్ధ విమానాలను ప్రవేశపెట్టారు. 1971 యుద్ధంలో భారత్‌కు అద్భుత విజయాన్నందించిన ఈ రష్యన్ ఫైటర్‌జెట్లు ఇప్పుడు అపకీర్తి మూటగట్టుకుంటున్నాయి. 1971-72 నుంచి ఇప్పటివరకు 400 మిగ్-21 ఫైటర్ జెట్లు కూలిపోయినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదాల్లో 200 మందికి పైగా పైలట్లు, దాదాపు 50 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. ప్రస్తుతం వాయుసేనలో కేవలం మూడు మిగ్-21 బైసన్ స్క్వాడ్రన్‌లు మాత్రమే పనిచేస్తుండగా, వాటన్నింటినీ 2025 ప్రారంభం నాటికి దశలవారీగా తొలగించాలని నిర్ణయించారు.