Pakistan Spy : రష్యా ఇండియన్‌ ఎంబసీలో పాక్‌ గూఢచారి

మీరట్‌లో అదుపులోకి తీసుకున్న యూపీ ఏటీఎస్

Update: 2024-02-05 04:15 GMT

పాకిస్థాన్‌ గూఢచారి సంస్థ ఐఎస్ఐ‌కు సైనిక రహస్యాలను చేరవేస్తున్నాడనే ఆరోపణలపై మాస్కోలోని భారత రాయబార కార్యాలయం ఉద్యోగిని ఉత్తర్ ప్రదేశ్ ఉగ్రవాద నిరోధక దళం (యూపీఏటీఎస్) ఆదివారం అరెస్ట్ చేసింది. విదేశాంగ శాఖలో మల్టీ-టాస్కింగ్ స్టాఫ్‌గా పనిచేస్తోన్న సతేంద్ర సివాల్‌ను మీరట్‌లో అదుపులోకి తీసుకున్నారు. విదేశీ వ్యవహారాల శాఖ ఉద్యోగులకు ఐఎస్ఐ డబ్బులను ఆశచూపి.. భారత సైన్యానికి సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని తస్కరించిందనే విశ్వసనీయ వర్గాల సమాచారంతో ఏటీఎస్ ఈ ఆపరేషన్ చేపట్టింది. 

అతడి కదలికలను అనుమానించిన అధికారులు ఎలక్ట్రానిక్‌, భౌతిక నిఘా పెట్టారు. పాక్‌ ఐఎస్‌ఐకి కీలక సమాచారం అందిస్తున్నట్టు గుర్తించిన ఉత్తరప్రదేశ్‌ యాంటీ టెర్రరిస్ట్‌ స్కాడ్‌ (ఏటీఎస్‌) తాజాగా అతడిని అరెస్ట్‌ చేసింది. విచారణలో అతడు నేరాన్ని అంగీకరించాడని పేర్కొంది. లక్నోలోని ఏటీఎస్‌ పోలీస్‌ స్టేషన్‌లో అతడిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదైన తర్వాత అరెస్ట్‌ చేసినట్టు వివరించింది. సతేంద్ర సివాల్‌ డబ్బులకు కక్కుర్తిపడి రక్షణ, విదేశాంగశాఖ, మిలటరీ కార్యకలాపాలకు సంబంధించిన వ్యూహాత్మక కార్యకలాపాల రహస్య సమాచారాన్ని ఐఎస్‌ఐకి చేరవేస్తున్నట్టు అధికారులు తెలిపారు.

చివరికి సతేందర్‌ను హాపూర్  మాస్కో కార్యాలయంలో 2021 నుంచి ఇండియా బేస్ట్‌ సెక్యూరిటీ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. పాకిస్థాన్‌ స్పై నెట్‌వర్క్‌లో అతడు ఓ కీలక వ్యక్తని అధికారులు అంటున్నారు. సతేందర్ తన హోదాను అడ్డుపెట్టుకొని కీలకమైన పత్రాలు సంపాదించాడు. అయితే వీటిల్లో రక్షణ, విదేశాంగ శాఖ నిర్ణయాలు, సైన్యం రోజువారీ కదలికలు వంటి వివరాలున్నాయి.

అయితే ఈ క్రమంలోనే అతడు కొందరు భారత అధికారులకు లంచాలను కూడా ఆశ చూపాడు. ఈ సమాచారాన్ని సతేందర్ పాకిస్థాన్‌లో ఉన్న ఐఎస్‌ఐ ప్రతినిధులకు కూడా చేరవేశాడు. అతడి కదలికలపై నిఘా పెట్టిన తర్వాత ఏటీఎస్ అధికారులు అతడ్ని మీరట్‌కు పిలిపించారు. వారు అడిగిన ప్రశ్నలకు సతేందర్‌ సరైన సమాధానాలు ఇవ్వలేదు. చివరికి అతడు పాకిస్థాన్‌కు గూఢచర్యం చేస్తున్నట్లు ఒప్పుకున్నాడు. నిందితుడు సివాల్‌పై అధికారిక రహస్యాల చట్టం సహా పలు సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదయ్యింది. దీనిపై స్పందించిన విదేశాంగ శాఖ.. సతేంద్ర సివాల్ అరెస్ట్ గురించి సమాచారం అందిందని, ఏటీఎస్ అధికారులతో కలిసి పనిచేస్తున్నామని చెప్పింది. 

Tags:    

Similar News