Shruti Chaturvedi: అమెరికాలో భారత యువ వ్యాపారవేత్త శ్రుతి చతుర్వేదికి చేదు అనుభవం..
అలస్కా ఎయిర్‌పోర్టులో పురుషులతో చెకింగ్ చేశారని ఆరోపించిన శ్రుతి..;
భారతీయ యువ వ్యాపారవేత్త శ్రుతి చతుర్వేదికి అగ్రరాజ్యం అమెరికాలో చేదు అనుభవం ఎదురైంది. అలస్కా ఎయిర్‌పోర్టులో తనను ఎఫ్‌బీఐ అధికారులు సుమారు 8 గంటల పాటు అన్యాయంగా నిర్బంధించారని ఆరోపణలు చేశారు. అలాగే, పురుషులతో తనిఖీలు చేయించారు.. కనీసం వాష్‌రూమ్‌కు కూడా వెళ్లేందుకు పర్మిషన్ ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ విషయాన్ని ట్విట్టర్ (ఎక్స్)లో ఆమె పోస్ట్ చేయగా సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారిపోయింది.
అయితే, హ్యాండ్ బ్యాగ్‌లోని ఓ పవర్ బ్యాంక్ అనుమానాస్పదంగా కనిపించడంతో అలస్కాలోని యాంకరేజ్ విమానాశ్రయంలో సెక్యూరిటీ సిబ్బంది తనను అడ్డుకున్నారని శ్రుతి చతుర్వేది తెలిపింది. ఈ సందర్భంగా ఓ పురుష సిబ్బంది తనను తనిఖీ చేశారు.. వెచ్చదనం కోసం వేసుకున్న బట్టలను సైతం తీసేయమని చెప్పారు.. నా మొబైల్ ఫోన్, వాలెట్ అన్నీ లాగేసుకున్నారు. కనీసం, చెకింగ్ సమయంలో వాష్‌రూమ్‌కు కూడా వెళ్లనివ్వలేది ఆవేదన వ్యక్తం చేసింది. ఒక్క ఫోన్ కాల్ చేసుకోవడానికి కూడా పర్మిషన్ ఇవ్వలేదు.. వీటన్నింటి వల్ల నేను వెళ్లాల్సిన విమానం మిస్ అయిపోయింది అని ఆ పోస్ట్‌లో రాసుకొచ్చింది. ఇక, దీనికి కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్, విదేశాంగ శాఖను ట్యాగ్ చేసింది. ఈ ఘటన మార్చ్ 30వ తేదీన శ్రుతి చతుర్వేది అలస్కా వెళ్లి తిరుగు పయనం అవుతుండగా జరిగిందని వెల్లడించింది.