Railway Strike: మే 1 నుంచి రైల్వే ఉద్యోగులు నిరవధిక సమ్మె..
పాత పెన్షన్ విధానాన్ని అమలుకు డిమాండ్;
పాత పెన్షన్ పథకంను పునరుద్ధరించకపోతే మే 1 నుంచి అన్ని రైళ్ల సర్వీసులనూ నిలిపివేస్తామని వివిధ రైల్వే ఉద్యోగుల, కార్మికుల సంఘాల ఐక్య వేదిక జాయింట్ ఫోరం ఫర్ రిస్టోరేషన్ ఆఫ్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ (జెఎఫ్‌ఆర్‌ఒపిఎస్) హెచ్చరించింది. JFROPS కోర్ కమిటీ సమావేశంలో మే 1, 2024 (అంతర్జాతీయ కార్మిక దినోత్సవం) నుండి OPS కోసం నిరవధిక సమ్మెను చేపట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు JFROPS కన్వీనర్ మరియు ఆల్ ఇండియా రైల్వేమెన్స్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి శివ గోపాల్ మిశ్రా తెలిపారు.
‘నూతన పెన్షన్ స్కీమ్ (ఎన్‌పిఎస్) స్థానంలో ‘నిర్వచించబడిన హామీతో కూడిన పాత పెన్షన్ స్కీమ్’ను పునరుద్ధరించాలని మేము ఎంతో కాలంగా కోరుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. దీంతో ఇప్పడు ప్రత్యక్ష చర్యకు దిగడం మినహా మరో మార్గం లేదు’ అని జెఎఫ్‌ఆర్‌ఒపిఎస్ కన్వీనర్, ఆల్ ఇండియా రైల్వేమెన్స్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి శివ గోపాల్ మిశ్రా ఒక ప్రకటనలో తెలిపారు. ‘జెఆఫ్‌ఆర్‌ఒపిఎస్ ఆధ్వర్యాన వివిధ ఫెడరేషన్ల ప్రతినిధులు సంయుక్తంగా ఈ నెల 19న అధికారికంగా రైల్వే మంత్రిత్వ శాఖకు సమ్మె నోటీసు అందజేస్తారు. అంతర్జాతీయ కార్మిక దినోత్సవమైన మేడే నాటి నుంచి దేశవ్యాప్త సమ్మెకు వెళ్తామని ప్రభుత్వానికి తెలియజేస్తున్నామని అన్నారు.
ఈ సమ్మెలో రైల్వే ఉద్యోగులు, కార్మికులతో పాటు ఇతర ప్రభుత్వ విభాగాల ఉద్యోగులు, సంఘాలు కూడా పాల్గొంటాయని మిశ్రా తెలిపారు. సమ్మె నోటీసును ఇవ్వడానికి అన్ని రాజ్యాంగ సంస్థలు తగు చర్యలు తీసుకోవాలని, అన్ని రకాల సన్నాహాలు చేయాలని జెఆఫ్‌ఆర్‌ఒపిఎస్ కోరింది. ఒపిఎస్ కార్మికుల ప్రయోజనాల కోసం ఉద్దేశించిందని, నూతన పెన్షన్ పథకం ఉద్యోగుల, కార్మికుల సంక్షేమాన్ని పట్టించుకోదని మిశ్రా విమర్శించారు.
ఇక ఈ నెల 19 వ తేదీన కేంద్ర రైల్వే మంత్రిత్వశాఖను కలిసి సమ్మె అంశంపై అధికారికంగా నోటీసు ఇవ్వాలని నిర్ణయించినట్లు జాయింట్ ఫోరం కన్వీనర్ వెల్లడించారు. ఇతర ప్రభుత్వ సంఘాలు సైతం తమ పోరాటంలో భాగం కానున్నాయని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కార్మికుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు శివ గోపాల్ మిశ్రా వివరించారు. దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ సంస్థ అయిన రైల్వేలో సమ్మె అనడంతో ప్రయాణికులు ఆందోళనలో ఉన్నారు.