INDIRA: పాక్ అకృత్యాలకు ఇందిరానే కారణం
పాక్ అణుకేంద్రంపై భారత్-ఇజ్రాయెల్ దాడి ప్లాన్ నిజమే: మాజీ సీఐఏ అధికారి... ఇందిరా గాంధీ ఆమోదం తిరస్కరణ 'సిగ్గు' చేటు *దాడి జరిగి ఉంటే సమస్యలు తప్పేవి*
పాకిస్థాన్ అణు కార్యక్రమాన్ని మొగ్గలోనే తుంచేందుకు 1980వ దశకంలో భారత్, ఇజ్రాయెల్ కలిసి దాడికి ప్రణాళిక రచించాయన్న వార్తలపై అమెరికా మాజీ నిఘా అధికారి రిచర్డ్ బార్లో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ దాడికి నాటి భారత ప్రధాని ఇందిరాగాంధీ అంగీకరించి ఉంటే ఎన్నో సమస్యలు పరిష్కారమయ్యేవని, కానీ ఆమె అలా చేయకపోవడం సిగ్గుచేటు అని ఆయన అభిప్రాయపడ్డారు. 1980లలో పాకిస్థాన్ రహస్యంగా అణ్వస్త్రాలను అభివృద్ధి చేస్తున్న సమయంలో సీఐఏలో కౌంటర్-ప్రొలిఫరేషన్ అధికారిగా పనిచేసిన రిచర్డ్ బార్లో, ఏఎన్ఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ కీలక విషయాలు వెల్లడించారు. పాకిస్థాన్‌లోని కహూటా అణుకేంద్రంపై భారత్-ఇజ్రాయెల్ ఉమ్మడి దాడికి పథకం రచించారన్న విషయం తనకు తెలుసని ఆయన ధృవీకరించారు. అయితే, ఆ సమయంలో తాను ప్రభుత్వ సర్వీసులో లేనందున తనకు ప్రత్యక్ష ప్రమేయం లేదని స్పష్టం చేశారు. "ఆ దాడి జరిగి ఉంటే బాగుండేది. ఇందిర దానికి అంగీకరించకపోవడం సిగ్గుచేటు. అది జరిగి ఉంటే చాలా సమస్యలు పరిష్కారమయ్యేవి" అని బార్లో అన్నారు.
పాకిస్థాన్ అణ్వస్త్రాలను అభివృద్ధి చేయకుండా, ముఖ్యంగా ఇజ్రాయెల్ శత్రువుగా భావించే ఇరాన్‌కు వాటిని బదిలీ చేయకుండా నిరోధించేందుకే కహూటా ప్లాంట్‌పై ఈ దాడికి పథకం రచించినట్లు గతంలో కథనాలు వెలువడ్డాయి. అయితే, ఇలాంటి దాడిని నాటి అమెరికా అధ్యక్షుడు రోనాల్డ్ రీగన్ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకించి ఉండేదని బార్లో అభిప్రాయపడ్డారు. సోవియట్ యూనియన్‌కు వ్యతిరేకంగా ఆఫ్ఘనిస్థాన్‌లో అమెరికా సాగిస్తున్న రహస్య యుద్ధానికి పాక్ సహకారం కీలకం కావడమే దీనికి కారణమని వివరించారు. ఆఫ్ఘనిస్థాన్‌లోని ముజాహిదీన్లకు అందుతున్న అమెరికా సహాయాన్ని పాకిస్థాన్ ఒక బ్లాక్మెయిల్ సాధనంగా వాడుకుందని బార్లో ఆరోపించారు.
పాక్ అణు ఇంధన కమిషన్ మాజీ అధిపతి మునీర్ అహ్మద్ ఖాన్ వంటి వారు ఇదే విషయాన్ని అమెరికా చట్టసభ సభ్యులకు చెప్పారని గుర్తుచేశారు. "మీరు మాకు సహాయం ఆపితే, మేం ముజాహిదీన్లకు మద్దతు ఇవ్వం అని వారు చెప్పకనే చెప్పారు" అని బార్లో వివరించారు. ఏక్యూ ఖాన్ నేతృత్వంలో ఏర్పాటైన ఈ కహూటా కేంద్రం వల్లే పాకిస్థాన్ చివరికి 1998లో అణుపరీక్షలు నిర్వహించి అణ్వస్త్ర దేశంగా అవతరించిందని ఆయన పేర్కొన్నారు. నివేదికల ప్రకారం.. పాక్‌లోని కహూతా అణుకేంద్రాన్ని బాంబులతో ధ్వంసం చేసేందుకు ఇజ్రాయెల్, భారత్ ప్లాన్ చేశాయి. అణ్వాయుధాలను పాక్ అభివృద్ధి చేయకుండా, వాటిని ఇతర దేశాలకు అందించకుండా నిరోధించేందుకు దాడి చేయాలని ప్రణాళిక రచించాయి. అయితే, ఈ రహస్య ఆపరేషన్‌ను అప్పటి భారత ప్రభుత్వం అడ్డుకుంది. రూపశిల్పి ఏక్యూ ఖాన్ నేతృత్వంలో అభివృద్ధి చెందిన కహూతా కేంద్రం.. చివరికి పాకిస్థాన్‌ను అణ్వస్త్ర దేశంగా మార్చింది. 1998లో పాకిస్థాన్ తొలి అణు పరీక్షలను విజయవంతంగా నిర్వహించిన విషయం తెలిసిందే. ఇక దీనిని విశ్లేషకులు ఇందిరా గాంధీ బ్లండర్ మిస్టేక్ అంటున్నారు. అమెరికా ఒత్తిడికి లొంగడం వల్ల, పాకిస్తాన్ 1998లో అణు పరీక్షలు చేసింది, ఇప్పుడు రోగ్ నేషన్‌గా మారింది. ఈ పరిణామాలు.. ఒక శాశ్వత ముప్పుగా మారాయి. ఈ నిర్ణయం వల్ల దక్షిణాసియాలో అణు ఆయుధాల రేస్ మొదలైంది. పాకిస్తాన్ అణు బాంబులు టెర్రరిజం వ్యాప్తికి సాధనాలుగా మారాయి. ఇండియా కూడా 1998లో పరీక్షలు చేసినా, పాక్ ముప్పు ఇప్పటికీ ఉంది. పాక్ మాట మాటకి న్యూక్లియర్ కార్డ్ ఉపయోగిస్తోంది.