Pakistani terrorists : జమ్మూలో 30 మంది పాకిస్థాన్ ఉగ్రవాదులు..
నిఘా వర్గాలు హెచ్చరిక
శీతాకాలంలోనూ జమ్మూ కశ్మీర్‌లో తీవ్రవాద ముప్పు కొనసాగుతోంది. జమ్మూ ప్రాంతంలోకి 30 మందికి పైగా పాకిస్థానీ ఉగ్రవాదులు చొరబడినట్టు నిఘా వర్గాలు అప్రమత్తం చేశాయి. దీంతో భారత ఆర్మీ ఈ చల్లాయి కలాన్ (40 రోజుల అత్యంత కఠినమైన చలికాలం) సమయంలోనూ ఉగ్రవాద నిరోధక ఆపరేషన్లను ముమ్మరం చేసింది. కొండలు, అడవులు, మారుమూల ప్రాంతాల్లో భద్రతా బలగాలు గాలింపు చర్యలు కొనసాగిస్తోందని అధికారులు వెల్లడించారు. డ్రోన్లు, థర్మల్ ఇమేజర్లు, గ్రౌండ్ సెన్సార్ల ద్వారా ఉగ్రవాదుల కదలికలను ట్రాక్ చేస్తున్నట్టు తెలిపారు. ఉష్ణోగ్రతలు మైనస్ డిగ్రీలకు పడిపోవడంతో పర్వత ప్రాంతాల్లో నిరంతర నిఘా కోసం తాత్కాలిక స్థావరాలను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
ప్రతికూల వాతావరణాన్ని ఆసరాగా చేసుకుని తీవ్రవాదులు ఎలాంటి దాడులకు పాల్పడకుండా నిరోధించడమే దీని లక్ష్యమని అధికార వర్గాలు తెలిపాయి. విపరీతంగా మంచు కురుస్తోండడంతో చొరబాట్లకు ఇదే సరైన సమయంగా భావించి అంతర్జాతీయ సరిహద్దును దాటుకుని భారత్‌లోకి చొరబడేందుకు ముష్కర మూకలు ప్రయత్నిస్తున్నాయని బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) అధికారి ఒకరు వెల్లడించారు. కానీ, వారి ప్రయత్నాలను సైన్యం తిప్పికొడుతోందని ఆయన వివరించారు. ఉగ్రవాదుల కదలికల నేపథ్యంలో గుల్మార్గ్, సోనామార్గ్ దాల్ లేక్ సహా పలు సున్నితమైన ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.
భధ్రత, ఇంటెలిజెన్స్ వర్గాలు వెల్లడించిన వివరాల ప్రకారం.. నిరంతర ఆపరేషన్లతో ఒత్తిడికి గురైన తీవ్రవాదులు.. తమ ఉనికి గుర్తించకుండా ఉండేందుకు కిష్టావర్, దోడా ప్రాంతాల్లోని ఎత్తైన, మధ్యస్థ పర్వత ప్రాంతాలకు తరలివెళ్లారు. ప్రజల సంచారం తక్కువగా ఉండే ఆ ప్రాంతాల్లో చలికాలంలో కార్యకలాపాలు తగ్గుతాయని భావించి, తిరిగి పుంజుకోవడానికి వెళ్లినట్లు తెలుస్తోంది.
డిసెంబర్ 21న చల్లాయి కలాన్ ప్రారంభమైనప్పటి నుంచి, మంచుతో కప్పి ఉండ, ఎత్తైన ప్రాంతాల్లో ఆర్మీ తన కార్యకలాపాలను విస్తరించింది. తీవ్రవాదుల స్థావరాలపై నిరంతర ఒత్తిడిని కొనసాగించడానికి, మైనస్ డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పడిపోయినా, ఫార్వర్డ్ వింటర్ బేస్‌లు, తాత్కాలిక నిఘా పోస్టులను ఏర్పాటు చేశారు.