IPAC: ఐప్యాక్‌పై ఈడీ దాడులు.. ప్రతీక్ జైన్ ఇంటికి మమతా
ఐప్యాక్‌పై ఈడీ దాడి... సోదాల వేళ జైన్ నివాసానికి సీఎం.. ‘రాజకీయ కుట్రే’ అంటూ దీదీ ఆగ్రహం
ప్రముఖ రాజకీయ వ్యూహాల సంస్థగా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఐప్యాక్ పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చేపట్టిన దాడులు పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో సంచలనం సృష్టించాయి. మనీలాండరింగ్‌కు సంబంధించిన కేసు దర్యాప్తులో భాగంగా గురువారం ఉదయం నుంచి కోల్‌కతా కేంద్రంగా ఐప్యాక్‌కు సంబంధించిన పలు కార్యాలయాలు, కీలక వ్యక్తుల నివాసాల్లో ఈడీ అధికారులు విస్తృత స్థాయిలో సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ దాడుల్లో భాగంగా ఐప్యాక్ డైరెక్టర్, సహ వ్యవస్థాపకుడైన ప్రతీక్ జైన్ నివాసం కూడా ఈడీ తనిఖీలకు లోనైంది. అధికారులు కీలక డాక్యుమెంట్లు, డిజిటల్ పరికరాలపై దృష్టి సారించినట్లు సమాచారం. ఈ తనిఖీలు కొనసాగుతున్న సమయంలోనే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్వయంగా ప్రతీక్ జైన్ నివాసానికి చేరుకోవడం రాజకీయంగా తీవ్ర దుమారం రేపింది. ఆమెతో పాటు కోల్‌కతా పోలీసు కమిషనర్ మనోజ్ వర్మ కూడా అక్కడకు వెళ్లడం మరింత వివాదాస్పదంగా మారింది.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన మమతా బెనర్జీ.. ఈడీ సోదాలను తీవ్రంగా ఖండించారు. కేంద్ర ప్రభుత్వం రాజకీయ ప్రతీకారంతోనే ఈడీని ఉపయోగిస్తోందని ఆరోపించారు. ‘‘ఇది చట్టపరమైన దర్యాప్తు కాదు.. రాజకీయ కుట్ర. మా పార్టీ ఎన్నికల వ్యూహం, అభ్యర్థుల జాబితా, అంతర్గత సమాచారాన్ని తెలుసుకునేందుకే ఈ దాడులు చేస్తున్నారు. టీఎంసీకి సంబంధించిన హార్డ్‌డిస్క్‌లు స్వాధీనం చేసుకునే ప్రయత్నం జరుగుతోంది’’ అంటూ దీదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు తాము పోరాడతామని ఆమె స్పష్టం చేశారు. అయితే ఈడీ దాడుల సమయం సీఎం జైన్ నివాసానికి వెళ్లడంపై బీజేపీ తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రతిపక్ష నేత సువేందు అధికారి ఈ వ్యవహారాన్ని దర్యాప్తులో ప్రత్యక్ష జోక్యంగా అభివర్ణించారు.
‘‘ఒక ముఖ్యమంత్రి ఇలాగా దర్యాప్తు జరుగుతున్న ప్రదేశానికి వెళ్లడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. ఇది చట్టవ్యవస్థను బలహీనపరిచే చర్య’’ అంటూ ఆయన విమర్శలు గుప్పించారు. సీఎం హోదాలో ఉండి ఇలాంటి చర్యలు చేయడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని సువేందు వ్యాఖ్యానించారు. ఐప్యాక్ సంస్థ రాజకీయ నేపథ్యాన్ని పరిశీలిస్తే.. 2019 లోక్‌సభ ఎన్నికల తర్వాత నుంచి తృణమూల్ కాంగ్రెస్‌తో ఈ సంస్థ సన్నిహితంగా పనిచేస్తోంది. ప్రతీక్ జైన్ ప్రస్తుతం టీఎంసీ ఐటీ విభాగం హెడ్‌గా కూడా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఎన్నికల వ్యూహాలు, డిజిటల్ ప్రచారం, అభ్యర్థుల ప్రొఫైలింగ్ వంటి అంశాల్లో ఐప్యాక్ కీలక పాత్ర పోషిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఐప్యాక్‌పై ఈడీ దాడులు రాజకీయ ప్రేరేపితమే అన్న వాదన బలపడుతోంది. ఇక మరోవైపు.. ఈడీ ఎందుకు ఈ దశలో సోదాలు చేపట్టిందన్న అంశంపై అధికారిక స్పష్టత ఇంకా వెలువడలేదు. అయితే కొద్ది నెలల్లో బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ ఈ పరిణామాలు చోటుచేసుకోవడం రాజకీయంగా కీలకంగా మారింది. అధికార–ప్రతిపక్షాల మధ్య ఇప్పటికే ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో ఈ దాడులు రాష్ట్ర రాజకీయాలను మరింత వేడెక్కించాయి.
ఈడీ చర్యలు, సీఎం మమతా ప్రత్యక్ష హస్తక్షేపం, బీజేపీ విమర్శలతో బెంగాల్ రాజకీయాలు మరో కీలక మలుపు తిరిగినట్టుగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రానున్న రోజుల్లో ఈ వ్యవహారం ఎటు దారితీస్తుందో.. దర్యాప్తు ఏ మలుపు తిరుగుతుందో అన్నదానిపై ఆసక్తి నెలకొంది. ఈడీ దాడులు, సీఎం మమతా బెనర్జీ ప్రత్యక్ష హస్తక్షేపంతో ఈ వ్యవహారం ఇప్పుడు చట్టపరమైన అంశాన్ని దాటి రాజకీయ పోరాటంగా మారింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ పరిణామాలు బెంగాల్ రాజకీయ సమీకరణాలపై ఎంత ప్రభావం చూపుతాయన్నది ఆసక్తికరంగా మారింది.