Jammu Kashmir : కాశ్మీర్‌లో రాహుల్ గాంధీ..
జమ్ము కశ్మీర్‌కు రాష్ట్ర హోదా పునరుద్ధరించాలన్న కాంగ్రెస్ నేత;
జమ్మూ కాశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల పోరులో విజయం సాధించేందుకు పార్టీల పోరు మొదలైంది. భారత చరిత్రలో తొలిసారి జమ్ము కశ్మీర్‌కు రాష్ట్ర ప్రతిపత్తిని లాగేసుకున్నారని కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. రంబాన్‌లో బుధవారం జరిగిన ఓ కార్యక్రమంలో రాహుల్ గాంధీ మాట్లాడారు. కేంద్ర పాలిత ప్రాంతాన్ని తొలుత రాష్ట్రంగా చేసి, ఒక రాష్ట్రాన్ని రద్దు చేసి ప్రజల హక్కులను కాలరాశారు. తొలుత జమ్ము కశ్మీర్‌కు రాష్ట్ర హోదాను పునరుద్దరించాలని డిమాండ్ చేశారు.
మీ రాష్ట్రాన్ని లాగేసుకోవడమే కాదు, మీ హక్కులు, మీ సంపద సహా ప్రతి ఒక్కటినీ మీ నుంచి లాగేసుకున్నారని ఆరోపించారు. 1947లో తాము రాజులను రద్దు చేసి ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామని, దేశానికి తాము రాజ్యాంగాన్ని ప్రసాదించామని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఇవాళ అదే జమ్ము కశ్మీర్‌లో లెఫ్టినెంట్ గవర్నర్ పేరుతో ఓ రాజు పెత్తనం చెలాయిస్తున్నారని కాషాయ పాలకులపై రాహుల్ విమర్శలు గుప్పించారు.
మరోవైపు జమ్ము కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధుల ఎంపిక కసరత్తును వేగవంతం చేసింది. అభ్యర్ధుల ఖరారు కోసం ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో కేంద్ర ఎన్నికల కమిటీ ఇటీవల భేటీ అయింది. ఆగస్ట్ 27న 9 మంది అభ్యర్ధులను కాంగ్రెస్ ప్రకటించగా మిగిలిన స్ధానాలపై వడపోతను ముమ్మరం చేసింది. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే అధ్యక్షతన ఎన్నికల కమిటీ సమావేశం జరిగింది.
ఈ భేటీలో లోక్‌సభ విపక్ష నేత రాహుల్ గాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. సీఈసీ భేటీ అనంతరం పార్టీ నేత టీఎస్ సింగ్‌దేవ్ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. సీఈసీ భేటీలో 29 అసెంబ్లీ స్ధానాలపై చర్చించామని, త్వరలో జాబితా విడుదలవుతుందని చెప్పారు. జమ్ము కశ్మీర్‌లో అన్ని అసెంబ్లీ స్ధానాలకూ పార్టీ అభ్యర్ధులను ఖరారు చేశామని కాంగ్రెస్ నేత అంబికా సోనీ వెల్లడించారు.