Uttar Pradesh: అఖిలేశ్ యాదవ్‌పై ఆర్ఎల్డీ చీఫ్ జయంత్ చౌదరి తీవ్ర ఆరోపణలు
రాణిని ఆశ జూపి.. రాజును చంపాలనుకున్నారు;
ఎస్పీ అధినేత, ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్‌పై రాష్ట్రీయ లోక్ దళ చీఫ్ జయంత్ చౌదరి తీవ్ర విమర్శలు గుప్పించారు.రాణిని ఆశజూపి.. రాజును చంపాలనుకున్నారంటూ చెస్ పరిభాషను ఉపయోగించారు. జయంత్ చౌదరి మాజీ ప్రధాని చరణ్ సింగ్ మనవడు. ఆయనకు ఇటీవల కేంద్ర ప్రభుత్వం భారతరత్నను ప్రకటించింది. అప్పటి వరకు ఇండియా కూటమిలో ఉన్న జయంత్ చౌదరి... ఆ తర్వాత ఎన్డీయే కూటమిలో చేరారు. అయితే ఆయనకు ఇండియా కూటమి 7 సీట్లు ఆఫర్ చేయగా, బీజేపీ మాత్రం 2 సీట్లు మాత్రమే కేటాయించింది. ఈ నేపథ్యంలో నిన్న అఖిలేశ్ మాట్లాడుతూ... బీజేపీ ఇచ్చిన రెండు సీట్ల కంటే మేం ఇస్తామన్న ఏడు సీట్లు ఎక్కువ అని జయంత్ చౌదరిని ఉద్దేశించి ఎద్దేవా చేశారు
అఖిలేశ్ యాదవ్ వ్యాఖ్యలకు జయంత్ చౌదరి కౌంటర్ ఇచ్చారు. తమకు ఎవరూ లెక్కలు నేర్పాల్సిన అవసరం లేదన్నారు. నిన్నటి వరకు మేం కలిసి ఉన్న మిత్రపక్షం, రాణిని చూపించి రాజును చంపాలనుకుంటోందని విమర్శించారు.
రాజకీయ జీవితంలో వ్యూహాలు ఉండాలని... అదే నాయకుడి లక్షణమన్నారు. చెస్ గేమ్‌లో... ప్రత్యర్థి బలహీనంగా ఉన్నానని నటిస్తూనే ఒక్కసారిగా మీకు చెక్ పెట్టే ఎత్తుగడను వేస్తుంటారు. గతంలో మేం ఉన్న పార్టీ మాతో అలాగే చేయాలనుకుందని ఇండియా కూటమిపై ఆరోపణలు చేశారు. వారు మాకు రాణిని ఆశ చూపి రాజును చంపాలనుకున్నారన్నారు. తద్వారా తమకు ఎక్కువ సీట్లను ఆశ చూపి తమకు చెక్ పెట్టాలని భావించారని ఆయన అభిప్రాయపడ్డారు.ఇదిలాఉంటే.. జాట్ కమ్యూనిటీలో కీలకమైన ఆర్‌ఎల్‌డీ పార్టీ ఉత్తర్‌ప్రదేశ్ పశ్చిమ ప్రాంతంలోని పలు స్థానాల ఫలితాలపై ప్రభావం చూపనుంది. అందుకే ఆర్‌ఎల్‌డీతో భాజపా పొత్తుకు ఆసక్తి చూపింది.
ఏప్రిల్ 19 నుంచి ఏడు దశల్లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. గరిష్టంగా 80 మంది ఎంపీలను పార్లమెంటుకు పంపే ఉత్తరప్రదేశ్ మొత్తం ఏడు దశల్లో ఓటు వేయనుంది. ఒకటి మరియు రెండు దశలకు ఏప్రిల్ 19 మరియు ఏప్రిల్‌లో 26న ఓటింగ్ జరగనుంది.