Prajawal Revanna : బెంగుళూరులో ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ అరెస్ట్

నేడు కోర్టులో హాజరు;

Update: 2024-05-31 01:00 GMT

మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న జేడీఎస్‌ ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణనుబెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత జర్మనీ నుంచి బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న ప్రజ్వల్‌ను సిట్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం భారీ భద్రత నడుమ విచారణ నిమిత్తం సీఐడీ కార్యాలయానికి తరలించారు.

ఎన్డీయే కూటమి తరఫున హాసన పార్లమెంట్‌ నియోజకవర్గం నుంచి పోటీచేశారు. అయితే పలువురు మహిళలపై ఆయన లైంగిక దాడి చేసినట్లు వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టిన విషయం తెలిసిందే. దీంతో గత ఏప్రిల్‌లో ఆయన దేశం విడిచి పారిపోయారు. ఇప్పటివరకు ఆయనపై మూడు కేసులు నమోదయ్యాయి.

ఈనేపథ్యంలో ప్రజ్వల్‌కు నాలుగుసార్లు నోటీసులు, ఒక అరెస్టు వారెంటు, బ్లూ కార్నర్‌ నోటీసు, రెడ్‌ కార్నర్‌ నోటీసులు జారీఅయ్యాయి. పాస్‌పోర్టు రద్దు చేసేందుకు కేంద్ర విదేశాంగ శాఖ చర్యలు చేపట్టింది. అయితే విచారణకు హాజరుకావాలని ఆయన తాత, మాజీ ప్రధాని దేవెగౌడ, తండ్రి హెచ్‌డీ రేవణ్ణ, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి బహిరంగంగానే ప్రజ్వల్‌ను కోరిన విషయం తెలిసిందే. దీంతో ఈ నెల 31న సిట్‌ ముందు హాజరవుతానంటూ గత సోమవారం (27వ తేదీన) వీడియో సందేశంలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో జర్మనీ నుంచి ఆయన బెంగళూరుకు వచ్చారు. వచ్చీరాగానే పోలీసులు అరెస్టుచేశారు.

ముందస్తు బెయిల్ పిటిషన్ పెండింగ్ లో

ప్రజ్వల్ తిరిగి రాగానే అరెస్ట్ చేసి చట్టపరమైన ప్రక్రియను ప్రారంభిస్తామని రాష్ట్ర హోంమంత్రి జి పరమేశ్వర తెలిపారు. ప్రజ్వల్ రేవణ్ణ ముందస్తు బెయిల్ పిటిషన్ నగరంలోని ప్రత్యేక కోర్టులో పెండింగ్‌లో ఉందని, అది ఈరోజు విచారణకు వచ్చే అవకాశం ఉంది. ప్రజ్వల్ వస్తాడని, విమానం టికెట్ బుక్ చేసుకున్నాడని సమాచారం అని పరమేశ్వర్ చెప్పారు. సిట్ అవసరమైన సన్నాహాలు చేసింది. ఆయన వస్తే న్యాయ ప్రక్రియ మొదలవుతుంది. చట్టప్రకారం అతడిపై వారెంట్‌ జారీ చేశామని, అందుకే అరెస్టు చేయాల్సి ఉంటుందన్నారు. దీనిపై సిట్ నిర్ణయం తీసుకోనుంది. మే 31 (నేడు) ఉదయం 10 గంటలకు సిట్ ఎదుట హాజరుకానున్నట్లు ప్రజ్వల్ తన వీడియోలో చెప్పినట్లు ఆయన తెలిపారు.

Tags:    

Similar News