Jharkhand: జార్ఖండ్‌లో మళ్లీ హేమంత్‌కే పట్టం

అనుకూలించిన కీలక అంశాలు ఇవే;

Update: 2024-11-24 01:15 GMT

అరెస్టులు, కేసులు, కోర్టులు, తిరుగుబాట్లు, అవినీతి ఆరోపణలు, ఇక చొరబాటుదారులదే రాజ్యం అవుతుందని స్వయానా ప్రధాని మోదీ చేసిన హెచ్చరికలు.. వీటన్నిటినీ ఎదుర్కొని హేమంత్‌ సోరెన్, కల్పనా సోరెన్‌ దంపతులు ఝార్ఖండ్‌లో విజయబావుటా ఎగరేశారు. తోడుదొంగలు అనే అర్థంలో భాజపా ఈసారి ఎన్నికల్లో వారిని ‘బంటీ ఔర్‌ బబ్లీ’ అని ఓ బాలీవుడ్‌ సినిమా పేరుతో పదేపదే వ్యంగ్యంగా విమర్శించిన విషయం తెలిసిందే. ఎగ్జిట్‌పోల్స్‌ అంచనాలను తలకిందులు చేస్తూ ‘ఝార్ఖండ్‌ ముక్తిమోర్చా’ (జేఎంఎం) నేతృత్వంలోని కూటమి సత్తా చాటుకుంది.

సవాళ్లు ఎదురైనా..

అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది ముందే ఝార్ఖండ్‌ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. మనీలాండరింగ్‌ కేసులో 49 ఏళ్ల హేమంత్‌ సోరెన్‌ అరెస్టై జైలుకు వెళ్లడం సంచలనం రేపింది. ఇదే అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించిన భాజపా.. హేమంత్‌ ప్రభుత్వం అవినీతిమయమైందని, బంగ్లాదేశ్‌ చొరబాటుదారులకు మద్దతిస్తోందని మండిపడింది. చంపయీ సోరెన్‌ను సీఎం పదవి నుంచి తప్పించడం గిరిజనులను అవమానపరచడమేనని ప్రచారం చేసినప్పటికీ ఫలితాలు ఆ పార్టీకి అనుకూలంగా రాలేదు. ప్రధాన భాగస్వామ్య పక్షమైన కాంగ్రెస్‌.. ఆశించిన మద్దతు ఇవ్వకున్నా, సంక్షేమ పథకాలు, ఆదివాసీ సెంటిమెంటును నమ్ముకున్న సోరెన్‌ ప్రభుత్వం అనుకూల ఫలితాలు సాధించింది. హేమంత్‌ అరెస్టును రాజకీయ ప్రేరేపిత చర్యగా ఆరోపించిన జేఎంఎం.. ఆదివాసీ సెంటిమెంటును తమవైపు తిప్పుకొంది. హేమంత్‌ అరెస్టు నేపథ్యంలో సీఎం పగ్గాలు చేపట్టిన చంపయీ.. ఆయన బయటకు రాగానే రాజీనామా చేయాల్సి వచ్చింది. తీవ్ర అసంతృప్తికిలోనై భాజపాలో చేరిపోయారు. హేమంత్‌ వదిన సీతా సోరెన్‌ కూడా కాషాయ కండువా కప్పుకోవడం జేఎంఎంకు ఎదురుదెబ్బగా మిగిలింది.

38 ఏళ్లకే సీఎం

జేఎంఎం వ్యవస్థాపకుడు శిబు సోరెన్, రూపీ దంపతుల నలుగురు పిల్లల్లో ఒకరు హేమంత్‌. 1975 ఆగస్టు 10న జన్మించిన ఆయన ఇంటర్‌ వరకే చదువుకున్నారు. మెకానికల్‌ ఇంజినీరింగ్‌లో చేరి మధ్యలోనే వదిలేశారు. 2005లో తొలిసారి దుమ్కా నుంచి ఎన్నికల్లో పోటీచేశారు. పార్టీ తిరుగుబాటు అభ్యర్థి స్టీఫెన్‌ మరాండీ చేతిలో ఓటమి పాలయ్యారు. 2009లో సోదరుడు దుర్గా అకాల మరణంతో అనూహ్యంగా పార్టీ కీలక బాధ్యతలు చేపట్టి, దాదాపు ఆరు నెలలపాటు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. ఆ తర్వాత 2010-13 మధ్య అర్జున్‌ ముండా ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. సంకీర్ణ రాజకీయ పరిణామాల్లో 2013 జులైలో తన 38వ ఏట.. అత్యంత పిన్నవయసున్న ఝార్ఖండ్‌ సీఎంగా బాధ్యతలు చేపట్టి, ఏడాదిపాటు కొనసాగారు. మళ్లీ 2019లో సీఎం అయి, ఈ ఏడాది జనవరి 31న ఈడీ తనను అరెస్టు చేయడానికి ముందు పదవికి రాజీనామా చేశారు. నాటకీయ పరిణామాల మధ్య ఫిబ్రవరి 2న చంపయీ సోరెన్‌ రాష్ట్ర 12వ సీఎం అయ్యారు. ఐదు నెలల తర్వాత జూన్‌ 28న హేమంత్‌ జైలు నుంచి విడుదలయ్యారు. మూడోసారి సీఎంగా జులై 4న ప్రమాణం చేశారు.

చతికిల పడ్డ భాజపా

ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించకపోవడం, ప్రభుత్వ వ్యతిరేకతను తమకు అనుకూలంగా మలచుకోకపోవడం వంటివి ఈ ఎన్నికల్లో భాజపాను దెబ్బకొట్టాయి. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్‌షా దాదాపు రెండు డజన్ల సభల్లో పాల్గొన్నా, భాజపా నేతలు విస్తృతంగా పర్యటించినా తమపార్టీని గెలిపించుకోలేకపోయారు. దాదాపు 200 సభలు నిర్వహించి.. బంగ్లాదేశ్‌ నుంచి అక్రమ వలసలు, అవినీతి గురించి భాజపా నేతలు పెద్దఎత్తున ప్రచారం చేశారు. మొత్తం ప్రచారాన్ని ఇద్దరు నేతలు నిర్వహించడం, వాటిలో స్థానిక అంశాలకు ప్రాధాన్యం లేకపోవడం, ఇతర పార్టీల నుంచి వచ్చినవారికి టికెట్లు ఇవ్వడం నష్టాన్ని కలిగించిందని భాజపా నేత ఒకరు అభిప్రాయపడ్డారు. ముస్లింలు, క్రైస్తవులు, గిరిజనులు సంప్రదాయ ఓటుబ్యాంకుగా ఉండగా ఈసారి మహిళలూ జేఎంఎంకు అండగా నిలిచారని రాంచీ విశ్వవిద్యాలయం రాజనీతి శాస్త్ర విభాగాధిపతి వర్మ విశ్లేషించారు.

Tags:    

Similar News