Jodhpur Sisters: పెళ్లికి కొన్ని గంటల ముందే ఇద్దరు అక్కాచెల్లెళ్ల ఆత్మహత్య

జోధ్‌పూర్ జిల్లాలోని మనై గ్రామానికి చెందినవారు

Update: 2026-02-22 05:45 GMT

రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ జిల్లా మనాయ్ గ్రామంలో గుండెను పిండేసే విషాదం చోటుచేసుకుంది. ఒకే పందిరిలో పెళ్లి పీటలు ఎక్కి కొత్త జీవితాన్ని ప్రారంభించాల్సిన ఇద్దరు అక్కాచెల్లెళ్లు, పెళ్లికి కొద్ది గంటల ముందే ప్రాణాలు తీసుకోవడం స్థానికంగా పెను కలకలం రేపింది. వధువులైన శోభ (25), విమ్ల (23) ఇద్దరూ ప్రైవేట్ స్కూల్ టీచర్లుగా పనిచేస్తున్నారు.

శనివారం వీరిద్దరికీ వివాహం జరగాల్సి ఉంది. శుక్రవారం అర్ధరాత్రి వరకు ఇంట్లో పెళ్లి వేడుకలు, సంప్రదాయ 'బంధోలి' వేడుకలు సందడిగా సాగాయి. అయితే, శనివారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో వీరిద్దరి ఆరోగ్య పరిస్థితి విషమించింది. కుటుంబ సభ్యులు వెంటనే వారిని ఆసుపత్రికి తరలించినప్పటికీ, అప్పటికే వారు మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. దీంతో కుటుంబ సభ్యులు మృతదేహాలను ఇంటికి తెచ్చి, పోలీసులకు చెప్పకుండానే అంత్యక్రియలకు ఏర్పాట్లు మొదలుపెట్టారు.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న బాధితుల మేనమామ జస్వంత్ సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. "మరో ఐదు నిమిషాలు ఆలస్యమైతే పోలీసులు వచ్చేలోపే అంత్యక్రియలు పూర్తి చేసేవారు" అని ఆయన పేర్కొన్నారు. మృతదేహాలు నీలి రంగులోకి మారాయని, ఇది విష ప్రయోగం వల్ల జరిగిన ఆత్మహత్యేనని ఆయన ఆరోపించారు.

బాధితుల తండ్రి సోదరులు (బాబాయిలు) ఈ పెళ్లి విషయంలో తీవ్ర ఒత్తిడి తెచ్చారని జస్వంత్ సింగ్ ఆరోపిస్తున్నారు. మొదట కుదిరిన పెళ్లి సంబంధాలను రద్దు చేసి, బాబాయిల ఒత్తిడి మేరకు పోఖ్రాన్ ప్రాంతానికి చెందిన వ్యక్తులతో పెళ్లి నిశ్చయించారని, ఈ బలవంతపు పెళ్లి ఇష్టం లేకనే సోదరీమణులు ఆత్మహత్య చేసుకున్నారని ఆయన పేర్కొన్నారు.

పోలీసులు మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ప్రాథమిక దర్యాప్తులో పురుగుల మందు తాగినట్లు ఆధారాలు లభించాయి. అయితే, ఘటనా స్థలంలో ఎటువంటి ఆత్మహత్య లేఖ లభించలేదని, కుటుంబ సభ్యులందరినీ విచారిస్తున్నామని ఏడీసీపీ రోషన్ మీనా తెలిపారు.

Tags:    

Similar News