Kallakkadal: కేరళ, తమిళనాడుకు కల్లక్కడల్ ముప్పు
అకాస్మత్తుగా విరుచుకుపడే రాకాసి అలలు..;
కేరళ, తమిళనాడు తీర ప్రాంతాలకు ‘‘కల్లక్కడల్’’ హెచ్చరికలు జారీ చేశారు. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన హెచ్చరికల ప్రకారం.. జనవరి 15 రాత్రి ఈ రెండు రాష్ట్రాల్లో ‘‘కల్లక్కడల్ అనే దృగ్విషయం’’ జరగనుంది. ఇది సముద్రాల్లో ఒకేసారి ఉప్పెనకు కారణమవుతుంది. అలలు సాధారణం కన్నా ఎక్కువ వేగంగా, ఎత్తుతో ఎగిసిపడుతుంటాయి.
మంగళవారం రాత్రి 11.30 గంటల వరకు ఈ ప్రాంతాల్లో 0.5 నుంచి 1.0 మీటర్ల ఎత్తు వరకు అలలు ఎగిసిపడే అవకాశం ఉందని, సముద్రం ఉప్పొంగే అవకాశం ఉందని ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ (INCOIS) తెలిపింది. మత్స్యకారులతో పాటు తీర ప్రాంతా ప్రజలు ప్రమాదకర ప్రాంతాల నుంచి సురక్షిత ప్రాంతాలకు మారాలని అధికారులు సూచించారు. తీర ప్రాంతంలోని చిన్న పడవలు, కంట్రీ బోట్లు సముద్రంలోకి వెళ్లవద్దని, ఫిషింగ్ బోట్లను తీరంలో సురక్షితంగా లంగరు వేసి ఉంచాలని అధికారులు సూచించారు.
హెచ్చరికలు ఉపసంహరించుకునే వరకు బీచ్‌లలో పర్యటక కార్యక్రమాలకు ప్రజలు దూరంగా ఉండాలని అధికారులు సూచించారు. ‘‘కల్లక్కడల్’’ అంటే, అకస్మాత్తుగా దొంగలా వచ్చే సముద్రం అని అర్ధం. హిందూ మహాసముద్రంలోని దక్షిణ భాగంలోని కొన్ని సమయాల్లో బలమైన ఈదురు గాలుల వల్ల సముద్ర అలలు ఎగిసిపడుతుంటాయి. ఉప్పెనలా విరుచుకుపడుతుంటాయి. ఇది ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా అకస్మాత్తుగా వస్తాయని INCOIS తెలిపింది.