ముస్లిం ప్రిన్సిపాల్‌ని తొలగించాలని వాటర్‌ ట్యాంక్‌లో విషం

కర్ణాటక బెళగావిలో సంచలనంగా మారిన సంఘటన..;

Update: 2025-08-04 01:15 GMT

కర్ణాటక బెళగావిలో జిల్లాలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఒక ప్రభుత్వ పాఠశాలలో ముస్లిం ప్రిన్సిపాల్‌ని తొలగించేందుకు కొందరు దారుణమైన పనికి ఒడిగట్టారు. పాఠశాలలోని నీటి ట్యాంక్‌లో విషం కలిపారు. దీంతో నీరు తాగిన పన్నెండు మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. విషం ప్రాణాంతకం కాకపోవడంతో విద్యార్థుల పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉంది. అయితే ఐదో తరగతి పిల్లాడి చేతికి విషం కలిపిన బాటిల్ ఇచ్చి కొంతమంది వాటర్ ట్యాంక్‌లో కల్పించినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.

 కర్ణాటక బెళగావిలో జిల్లాలో ఒక ప్రభుత్వ పాఠశాలలో ముస్లిం ప్రిన్సిపాల్‌ని తొలగించేందుకు కొందరు దారుణమైన పని చేశారు. పాఠశాలలోని నీటి ట్యాంక్‌లో విషం కలిపారు. జూలై 14న జరిగిన ఈ సంఘటనలో, శ్రీరామ్ సేన అనే మితవాద గ్రూపుతో అనుబంధం ఉన్న స్థానిక నాయకుడు సహా ముగ్గురు వ్యక్తుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. హులికట్టిలోని ప్రభుత్వ లోయర్ ప్రైమరీ స్కూల్‌లో గత 13 సంవత్సరాలుగా సేవలందిస్తున్న ప్రధానోపాధ్యాయుడు సులేమాన్ గోరినాయక్ చుట్టూ భయాందోళనలు, అనుమానాలను సృష్టించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ చర్యతో అతని ప్రతిష్టను దెబ్బతీసి, బలవంతంగా బదిలీ చేయాలని ప్లాన్ చేసినట్లు పోలీసులు తెలిపారు.

పాఠశాల ట్యాంక్ నుండి నీరు తాగిన తర్వాత పన్నెండు మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. విషం ప్రాణాంతకం కాకపోయినా, పాఠశాల అధికారులు, తల్లిదండ్రులలో ఆందోళన కలిగించాయి. పిల్లలకు వెంటనే చికిత్స అందించడంతో ప్రస్తుతం వారంతా కోలుకుంటున్నారు. విచారణలో ఐదో తరగతి పిల్లాడు నీటిలో విషం కలిపినట్లు గుర్తించారు. అయితే, పిల్లాడిని విచారించగా, నిందితులు వాటర్ బాటిల్ ఇచ్చి వాటర్ ట్యాంక్‌లో కలపాలని చెప్పినట్లు వెల్లడించాడు. ఆ బాటిల్ ఇచ్చిన వ్యక్తిని కృష్ణ మదార్‌గా గుర్తించారు.

విచారణలో కృష్ణను వేరే నిందితులు బెదిరించినట్లు తేలింది. తన కులాంతర ప్రేమను బయటపెడతారని బెదిరించడంతో తాను ఈ పనిచేశానని, సాగర్ పాటిల్, నాగన గౌడ పాటిల్ తనను బ్లాక్‌మెయిల్ చేస్తున్నారని పోలీసులకు తెలిపాడు. ఒత్తిడికి గురైన కృష్ణ మదార్, పాఠశాల వాటర్ ట్యాంక్‌లో విషం కలపాలనే వారి డిమాండ్‌ని అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. శ్రీరామ సేన తాలూకా స్థాయి అధ్యక్షుడు సాగర్ పాటిల్ ఈ ఘటన వెనక మాస్టర్ మైండ్‌గా గుర్తించారు. ప్రిన్సిపాల్‌గా ముస్లిం వ్యక్తి ఉన్నాడనే కోపంతోనే పాటిల్ ఈ పనిచేసినట్లు అంగీకరించాడని పోలీసులు విచారణలో తేలింది. ముగ్గురు నిందితులు – సాగర్ పాటిల్, నాగనగౌడ పాటిల్ మరియు కృష్ణ మదార్‌లను అరెస్ట్ చేశారు.

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఈ విషప్రయోగ ప్రయత్నాన్ని ఖండించారు. దీనిని “మతపరమైన ద్వేషం మరియు మౌలికవాదం ద్వారా నడిచే హేయమైన చర్య” అని అభివర్ణిస్తూ, ఈ నేరం మత సామరస్యానికి తీవ్ర ముప్పు కలిగిస్తుందని ఆయన అన్నారు.

Tags:    

Similar News