Karur Stampede: హీరో విజయ్ ఇంటికి బాంబు బెదిరింపులు
రాష్ట్ర డీజీపీ ఆఫీసుకు గుర్తుతెలియని వ్యక్తులు ఈ–మెయిల్
తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ అధ్యక్షుడు, హీరో విజయ్ ఇంటికి బాంబు బెదిరింపులు వచ్చాయి. చెన్నైలోని నీలాంగరైలోని విజయ్ ఇంట్లో బాంబు పెట్టినట్లు ఆదివారం రాత్రి 9:30 గంటల ప్రాంతంలో రాష్ట్ర డీజీపీ ఆఫీసుకు గుర్తుతెలియని వ్యక్తులు ఈ–మెయిల్ చేశారు. వెంటనే అప్రమత్తమై పోలీసులు విజయ్ ఇంట్లో తనిఖీలు చేశారు. బాంబు స్క్వాడ్, జాగిలాలతో తనిఖీలు చేపట్టారు. అయితే ఇంట్లో పేలుడు పదార్థాలు ఏమీ లభించలేదు. దాంతో విజయ్ కుటుంబసభ్యులు, పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ–మెయిల్ ఎక్కడి నుంచి వచ్చిందని పోలీసులు ఆరా తీస్తున్నారు.
తమిళనాడులోని కరూర్‌లో టీవీకే పార్టీ అధినేత విజయ్ ప్రచార సభలో శనివారం తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. తొక్కిసలాట ఘటనలో మృతుల సంఖ్య నేటికి 40కి చేరింది. పలు ఆసుపత్రుల్లో 80 మంది చికిత్స పొందుతున్నారు. అందులో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. తొక్కిసలాట ఘటనకు సంబంధించి టీవీకే నాయకులు నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. హీరో విజయ్‌ను అరెస్టు చేయవచ్చనే ఊహాగానాలు సోషల్ మీడియాలో వినిపించాయి. చెన్నైలోని ఆయన నివాసం వద్ద పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు.
మృతుల కుటుంబాలకు రూ.20 లక్షల చొప్పున, క్షతగాత్రులకు రూ.2 లక్షల చొప్పున విజయ్ నష్ట పరిహారం ప్రకటించారు. తొక్కిసలాట దుర్ఘటనపై విజయ్ స్పందించారు. తన గుండె ముక్కలైందని, చెప్పలేని దుఃఖంతో కుమిలిపోతున్నానని తీవ్ర భావోద్వేగం వ్యక్తం చేశారు. కరూర్‌లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారు త్వరగా కోలుకోవాలని విజయ్ ప్రార్ధించారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున, క్షతగాత్రులకు రూ.లక్ష చొప్పున పరిహారం ప్రకటించింది.