Kerala Bomb Blast : ఢిల్లీ, ముంబయితోపాటు దేశవ్యాప్తంగా హై అలర్ట్
రద్దీగా ఉండే ప్రాంతాల్లో భద్రత కట్టుదిట్టం;
కేరళలో బాంబు పేలుడు దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలోనే కేంద్ర నిఘా వ్యవస్థలు అప్రమత్తం అయ్యాయి. ఈ నేపథ్యంలోనే దేశంలోని ప్రధాన నగరాల్లో హై అలర్ట్ విధించారు. ఢిల్లీ, ముంబై నగరాల్లో రద్దీగా ఉండే ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.
కేరళలోని కోచి సమీపంలో ఉండే కలమస్సెరి ప్రాంతంలో క్రిస్టియన్ సంఘానికి చెందిన జమరా ఇంటర్ నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో ఆదివారం ఉదయం జరిగిన పేలుడులో ఒకరు మృతి చెందారు. 52 మంది గాయపడ్డారు. పేలుడు ధాటికి కన్వెన్షన్ సెంటర్‌లో మంటలు భారీగా ఎగిసిపడ్డాయి. కుర్చీలు మంటల్లో కాలిపోయాయి. కన్వెన్షన్ సెంటర్‌లో క్రైస్తవులు ఆదివారం ప్రార్థనలు చేస్తున్న సమయంలో మొదటి పేలుడు సంభవించిందని, తర్వాత మరో రెండు పేలుళ్లు జరిగాయని ఆ సమయంలో లోపలే ఉన్న వృద్ధురాలు తెలిపింది. మొత్తం మూడు పేలుళ్ల జరగ్గా రెండు శక్తివంతమైనవని పోలీసు వర్గాలు వెల్లడించాయి. పేలుడు జరిగిన సమయంలో కన్వెన్షన్ సెంటర్లో 2వేల మంది ఉన్నట్లు అక్కడే ఉన్న మరో వ్యక్తి తెలిపారు. పేలుడు జరిగిన వెంటనే లోపల ఉన్నవారు భయంతో బయటకు పరుగులు తీశారు. కొందరు మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు.
క్షతగాత్రులను వేర్వేరు ఆసుపత్రుల్లో చేర్చారు. వారిలో 30 మందికి కలమస్సెరి వైద్య కళాశాలలో చికిత్స అందిస్తున్నారు. ఆ 30 మందిలో 18 మంది ICUలో ఉండగా వారిలో ఆరుగురు తీవ్రంగా గాయపడినట్లు కేరళ ఆరోగ్యమంత్రి వీణ జార్జ్ చెప్పారు. మిగిలిన వారు ప్రైవేటు ఆసుపత్రుల్లో చేరినట్లు ఆమె వివరించారు. వైద్య కళాశాలకు వెళ్లిన ఆమె క్షతగాత్రులను పరామర్శించారు. త్రిసూర్ వైద్యకళాశాల నుంచి ప్లాస్టిక్ సర్జన్లను రప్పించినట్లు ఆరోగ్యశాఖ మంత్రి చెప్పారు. తాము మెడికల్ బోర్డు ఏర్పాటు చేసి ప్రతి ఒక్క పేషెంట్ పరిస్థితిని పరిశీలిస్తున్నట్లు వివరించారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో ఉన్న రోగులను, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉన్న క్షతగాత్రుల పరిస్థితిని కలెక్టర్ పర్యవేక్షిస్తున్నట్లు మంత్రి వివరించారు.
పేలుళ్లకు ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైస్‌ను ఉపయోగించినట్లు కేరళ పోలీసులు తెలిపారు. పేలుడు పదార్థాలను టిఫిన్ బాక్స్‌లో ఉంచినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. కేరళ పేలుడు తరువాత, ఢిల్లీ-ముంబయి నగరాలతో పాటు దేశవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు. ముంబై వరల్డ్ కప్ విషయంలో అలర్ట్ కొనసాగుతోంది. ఢిల్లీలోని పలు చర్చిల్లో భద్రతను పెంచారు. కేరళ పేలుళ్లపై ముఖ్యమంత్రి నుంచి అమిత్ షా సమాచారం తీసుకున్నారు. ఎన్‌ఐఏ, ఎన్‌ఎస్‌జీ బృందాలు కూడా ఘటనాస్థలికి చేరుకున్నాయి. శుక్రవారం కేరళలోని మలప్పురంలో పాలస్తీనాకు మద్దతుగా ర్యాలీ నిర్వహించారు.