Rahul Mamkootathil: లైంగిక వేధింపుల ఆరోపణలు.. ఎమ్మెల్యేను సస్పెండ్ చేసిన కాంగ్రెస్
పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి ఆరు నెలల పాటు వేటు వేసిన అధిష్ఠానం;
కేరళలో సంచలనం సృష్టించిన లైంగిక వేధింపుల వ్యవహారంలో కేరళ కాంగ్రెస్ ఎమ్మెల్యే రాహుల్ మమ్‌కూటథిల్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఆరోపణలు రాగానే ముందుగానే యూత్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేశాడు. తాజాగా అతడిని పార్టీ నుంచి కాంగ్రెస్ సస్పెండ్ చేసింది. పాలక్కాడ్ ఎమ్మెల్యే రాహుల్ మమ్‌కూటథిల్ కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వం నుంచి సస్పెండ్ చేసింది.
మలయాళ నటి రిని ఆన్ జార్జ్, రచయిత్రి హనీ భాస్కరన్, ఒక ట్రాన్స్‌జెండర్, పలువురు మహిళలు.. ఎమ్మెల్యే రాహుల్‌పై తీవ్ర లైంగిక ఆరోపణలు చేశారు. హోటల్ గది బుక్ చేశాను.. అక్కడికి రావాలంటూ వేధిస్తున్నాడని.. సోషల్ మీడియాలో కూడా అభ్యంతరకర సందేశాలు పంపిస్తున్నాడని ఆరోపించారు. ఇదే కోవలో చాలా మంది మహిళలు ఉన్నారని వాపోయారు. ఇక కాంగ్రెస్ ఎమ్మెల్యే రాహుల్ వ్యతిరేకంగా పెద్ద ఎత్తున మహిళలు నిరసనలు వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాంండ్ చేశారు. ఆందోళనలు, నిరసనలు తీవ్రం కావడంతో కాంగ్రెస్ అప్రమత్తమై పార్టీ నుంచి సస్పెండ్ చేసింది.
మలయాళ నటి జార్జ్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఒక ప్రధాన పార్టీకి చెందిన యువ నాయకుడు తనను లైంగికంగా వేధిస్తున్నాడని.. అభ్యంతరకరమైన సందేశాలు పంపిస్తున్నాడని వాపోయింది. హోటల్‌కు రావాలంటూ ఒత్తిడి చేస్తున్నాడని తెలిపింది. కానీ ఎక్కడా కూడా నిందితుడి పేరు ప్రస్తావించలేదు. ఇంతలోనే బీజేపీ జోక్యం పుచ్చుకుని పాలక్కూడ్ ఎమ్మెల్యే రాహుల్ రాజీనామా చేయాలని ఆందోళన చేపట్టింది. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని కోరింది. పార్టీ కార్యాలయానికి మార్చ్ కూడా నిర్వహించింది.
ఇదిలా జరుగుతుండగానే రచయిత్రి హనీ భాస్కరన్.. యువ ఎమ్మెల్యే రాహుల్ తనను లైంగికంగా వేధిస్తున్నాడంటూ బహిరంగంగానే పేరు ప్రస్తావించి ఆరోపణలు గుప్పించింది. నిరంతరం సందేశాలు పంపిస్తున్నాడని వాపోయింది. ఈ ఆరోపణలు చేసిన కొన్ని గంటలకే అవంతిక అనే ట్రాన్స్ మహిళ కూడా యువ ఎమ్మెల్యేపై సంచలన ఆరోపణలు చేసింది. తనపై అత్యాచారానికి ప్రయత్నించాడని తెలిపింది. తన కోరిక తీర్చాలంటూ అనేక సందేశాలు పంపించాడని ఆరోపించింది. బెంగళూరు లేదా హైదరాబాద్ వెళ్లి లైంగిక తృప్తి పొందుదామని చెప్పాడని ఆరోపించింది. ఎన్నికల సమయంలోనే రాహుల్‌ను కలిశానని.. కేవలం సాధారణ స్నేహం మాత్రమే జరిగిందని.. కానీ ఇంతలోనే తన కోరిక తీర్చాలంటూ అసభ్యకరమైన సందేశాలతో వేధించాడని అవంతిక తెలిపింది.