Sabarimala: ఇకపై ఆన్ లైన్ లో బుక్ చేసుకుంటేనే అయ్యప్ప దర్శనం

కేరళ సీఎం పినరయి విజయన్ అధ్యక్షతన కీలక సమావేశం;

Update: 2024-10-06 02:30 GMT

త్వరలో కార్తీక మాసం రానుండడంతో అయ్యప్ప దీక్షలకు సమయం ఆసన్నమైంది. ఈ నేపథ్యంలో, కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఆన్ లైన్ లో స్లాట్ బుక్ చేసుకున్న భక్తులకు మాత్రమే శబరిమల అయ్యప్పస్వామిని దర్శించుకునే వీలుంటుంది. ఇవాళ సీఎం పినరయి విజయన్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఇకమీదట శబరిమల వచ్చే భక్తులు ముందుగా ఆన్ లైన్ లో బుక్ చేసుకోవాలని కేరళ సర్కారు స్పష్టం చేసింది. అయ్యప్ప భక్తులు పరమపవిత్రంగా భావించే మకరవిళక్కు సీజన్ మరో నెల రోజుల్లో ప్రారంభం కానుంది.

స్వామివారి దర్శనానికి ఆన్ లైన్ బుకింగ్ ను తీసుకువస్తున్న కేరళ ప్రభుత్వం... రోజుకు 80 వేల మంది భక్తులను మాత్రమే అనుమతించాలని నిర్ణయించింది. వర్చువల్ క్యూ బుకింగ్ విధానంలో భక్తులు తాము వచ్చే మార్గాన్ని కూడా ఎంపిక చేసుకోవచ్చు. ఈ క్రమంలో, అటవీమార్గంలో వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని నిర్ణయించింది.

దర్శనం కోసం వచ్చే భక్తుల కోసం ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. అటవీ మార్గంలో వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్లు అధికారులు తెలిపారు. పార్కింగ్‌ సమస్యలను పరిష్కరించడంపై దృష్టి పెట్టినట్లు పేర్కొన్నారు. శబరిమలకు వెళ్లే మార్గంలో రోడ్లు, దాని చుట్టూ పార్కింగ్‌ నిర్వహణ పనులు త్వరలో పూర్తవుతాయని చెప్పారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో ఒక అతిథి గృహ నిర్మాణం పూర్తయిందని.. త్వరలో మరొకటి పూర్తి కానున్నట్లు అధికారులు వెల్లడించారు

Tags:    

Similar News