Delhi Car Blast: ఉమర్, షాహీన్‌తో సంబంధాలు..ఢిల్లీ బ్లాస్ట్ కేసులో కీలక అరెస్ట్‌లు..
వెలుగులోకి అంతర్జాతీయంగా జరిగిన కుట్ర
ఢిల్లీ పేలుడుపై దర్యాప్తు కొనసాగుతోంది. దర్యాప్తులో అనేక కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తవ్వేకొద్దీ ఉగ్ర కుట్ర కోణాలు బయటకు వస్తున్నాయి. ఉగ్రవాది ఉమర్‌కు సంబంధించిన విషయాల్లో అంతర్జాతీయంగా జరిగిన కుట్ర వెలుగులోకి వచ్చింది.
ఇక దర్యాప్తులో భాగంగా కీలక అరెస్ట్‌లు జరిగాయి. ఫరీదాబాద్ టెర్రర్ మాడ్యూల్‌లో భాగంగా జమ్మూకాశ్మీర్‌కు చెందిన కార్డియాలజిస్ట్ మహ్మద్ ఆరిఫ్‌ను కాన్పూర్‌లో అరెస్ట్ చేశారు. ఇటీవల అరెస్టైన డాక్టర్ షాహీన్‌తో దగ్గర సంబంధాలు ఉన్నట్లుగా తేలింది. వీరిద్దరూ నిత్యం టచ్‌లోనే ఉన్నట్లుగా దర్యాప్తు అధికారులు కనిపెట్టారు.అలాగే ఫహీమ్ అనే మరొక వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఖండ్వాలీ ప్రాంతంలో ఎరుపు రంగు ఎకోస్పోర్ట్స్ కారును పార్కు చేసిన వ్యక్తిగా గుర్తించి ఫరీదాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఫహీమ్.. ప్రధాన నిందితుడు డాక్టర్ ఉమర్ నబీ బంధువుగా గుర్తించారు.
టెర్రర్ మాడ్యూల్ ప్రకారం ఉమర్ మూడు కార్లు కొనుగోలు చేశాడు. హ్యుందాయ్ ఐ20, ఎరుపు రంగు ఫోర్డ్ ఎకోస్పోర్ట్, మారుతి బ్రెజ్జాలను కొనుగోలు చేశాడు. ఈ మూడు కారుల్లో సోమవారం సాయంత్రం ఎర్రకోట దగ్గర హ్యుందాయ్ i20 కారు పేలిపోయింది. ఇక రెండో ఎరుపు రంగు కారును తాజాగా స్వాధీనం చేసుకున్నారు. బుధవారం ఢిల్లీ రిజిస్ట్రేషన్ నంబర్ 0458 కలిగిన ఎకోస్పోర్ట్‌ను ఫరీదాబాద్‌లో ట్రాక్ చేశారు. ఇక మూడో కారు మారుతి బ్రెజ్జా కోసం గాలిస్తున్నారు. దీని కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. ఈ మూడు వాహనాల్లో పెద్ద ఎత్తున ఐఈడీలు పెట్టుకుని భారీ దాడులు చేయాలని.. అంతేకాకుండా అస్సాల్ట్ రైఫిల్స్‌తో విచక్షణారహితంగా కాల్పులు కూడా జరపాలని ఉమర్ ప్లాన్ చేసుకున్నట్లుగా దర్యాప్తు సంస్థలు కనుగొన్నాయి.
అయోధ్య టార్గెట్..
ఇక ఉమర్ తదుపరి లక్ష్యం అయోధ్య అని తేల్చారు. నవంబర్ 25, 2025న అయోధ్య రామాలయంలో ‘ధ్వజారోహణం’ (జెండా ఎగురవేత) వేడుకతో పాటు ఆలయ శిఖరంపై కాషాయ జెండాను ఎగురవేసే సమయంలో ఉమర్ దాడి చేయాలని ప్లాన్ వేసుకున్నట్లు దర్యాప్తు అధికారులు పేర్కొన్నారు.
ఇక ఫరీదాబాద్‌లో అమ్మోనియం నైట్రేట్, ఆర్డీఎక్స్ మిశ్రమాన్ని పెద్ద ఎత్తున దర్యాప్తు బృందం స్వాధీనం చేసుకుంది. ఇది మిలిటరీ-గ్రేడ్ పేలుడు పదార్థాలకు సంబంధించిందిగా తేల్చారు. ఢిల్లీలో పేలిన కారులో ఇవే ఉపయోగించారా? లేదా? అనేది ఫోరెన్సిక్ బృందాలు తేల్చనున్నాయి.
ఇక ఈ కుట్రంతా టర్కీ కేంద్రంగా జరిగినట్లుగా కనిపెట్టారు. 2022లో రూపొందించిన ప్రణాళికగా దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. ఇక ఉమర్.. ప్రస్తుతం ‘ఉకాసా’ అనే కోడ్‌నేమ్‌తో పిలవబడుతున్నాడు. టర్కీలోని హ్యాండ్లర్లు.. ఉమర్‌ను ‘ఉకాసా’గానే పిలుస్తారు. ఉమర్ నెట్‌వర్క్‌పై దర్యాప్తు సంస్థలు దృష్టిపెట్టినప్పుడు ఈ అంతర్జాతీయ సంబంధాలు వెలుగులోకి వచ్చాయి.