Kapil Sharma: ప్రముఖ కమెడియన్ రెస్టారెంట్‌పై ఖలిస్తాన్ టెర్రరిస్ట్‌ల కాల్పులు.

గత కొన్ని రోజుల క్రితమే కెనడాలో రెస్టారెంట్ ఓపెన్ చేసిన కపిల్ శర్మ..;

Update: 2025-07-11 01:15 GMT

ప్రముఖ కమెడియన్ కపిల్ శర్మ కేఫ్‌పై ఖలిస్తానీ ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. కెనడాలో కేఫ్ ప్రారంభించిన కొన్ని రోజులకే ఈ ఘటన జరిగింది. కనీసం, 9 రౌండ్ల కాల్పులు జరిగినట్లు తెలుస్తోంది. ఖలిస్తాన్ ఉగ్రవాది హర్జీత్ సింగ్ లడ్డీ ఈ కాల్పులకు బాధ్యత వహించారు. అయితే, ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు.

కాప్స్ కేఫ్, రెస్టారెంట్ పేరుతో కపిల్ శర్మ రెస్టారెంట్ బిజినెస్ ప్రారంభించారు. తన భార్య గిన్నీ చత్రత్‌ భాగస్వామ్యంతో ఈ వ్యాపారంలో అడుగుపెట్టాడు. కెనడాలోని బ్రిటిష్ కొలంబియాలోని సర్రేలో ఉన్న కేఫ్‌ కొన్ని రోజుల క్రితమే లాంచ్ చేయబడింది. అయితే, బుధరవారం రాత్రి(కెనడా కాలమానం) వచ్చిన ఒక వ్యక్తి కారులో కూర్చుని రెస్టారెంట్‌పైకి 9 రౌండ్లు కాల్చడం అక్కడ ఉన్న సీసీకెమెరాల్లో రికార్డయింది.

ఈ ఘటనకు పాల్పడిన ఖలిస్తాన్ ఉగ్రవాది లడ్డీ ఎన్ఐఏ మోస్ట్ వాంటెడ్ లిస్టులో ఉన్నాడు. ఇతడికి నిషేధిత బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్‌తో సంబంధాలు ఉన్నాయని భారత అధికారులు తెలిపారు. గతంలో కపిల్ శర్మ చేసిన ప్రకటనలతో మనస్తాపం చెందడం వల్లే కాల్పులకు ఆదేశించినట్లు తెలుస్తోంది. కాల్పులు జరిపిన తర్వాత సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

విశ్వ హిందూ పరిషత్ (VHP) నాయకుడు వికాస్ ప్రభాకర్ అలియాస్ వికాస్ బగ్గా హత్యకు హర్జీత్ సింగ్ లడ్డీని జాతీయ దర్యాప్తు సంస్థ కోరుతోంది. 2024 ఏప్రిల్‌లో పంజాబ్‌లోని రూప్‌నగర్ జిల్లాలోని తన దుకాణంలో వికాస్‌‌ కాల్చి చంపబడ్డాడు.

Tags:    

Similar News