Kolkata Doctor case: కోల్‌కతా వైద్యురాలి హత్యాచార ఘటన సిబిఐకి బదిలీ
రంగంలోకి దిగిన సీబీఐ.. కోల్‌కతాకి ఢిల్లీ ప్రత్యేక బృందాలు;
పశ్చిమబెంగాల్‌లో జూనియర్ వైద్యురాలిపై అత్యాచారం, హత్య కేసు దర్యాప్తును సిబిఐకి బదిలీ చేస్తూ కోల్‌కతా హైకోర్టు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రాథమికంగా ఈ కేసు దర్యాప్తులో గణనీయమైన పురోగతి కనిపించడం లేదని జస్టిస్ టి.ఎస్. శివజ్ఞానం నేతృత్వంలోని డివిజన్ బెంచ్ పేర్కొంది. యంత్రాంగం బాధితురాలి లేదా బాధితురాలి కుటుంబంతో లేదని పేర్కొనడం సమంజసమేనని కోర్టు పేర్కొంది.
ఆగస్ట్ 14 ఉదయం 10.00 గంటలకల్లా కేసు డైరీ, ఇతర రికార్డులను సిబిఐకి అప్పగించాల్సిందిగా కోర్టు ఆదేశించింది. సమ్మె విరమించాలని నిరసన తెలుపుతున్న జూనియర్ వైద్యులను కోర్టు కోరింది. ఈ కేసు మొదట్లో ప్రిన్పిపాల్‌పై హత్య కేసు ఎందుకు నమోదు చేయలేదని, తాలా పోలీస్ స్టేషన్‌నలో అసహజ మరణంగా ఎందుకు నమోదు చేశారని చీఫ్ జస్టిస్ ప్రశ్నించారు.
వైద్యురాలు హత్యాచారానికి గురైతే.. కుటుంబ సభ్యులకు ఆత్మహత్యగా ఎందుకు చెప్పారని కోర్టు నిలదీసింది. ఇక ఈ కేసులో ప్రిన్సిపాల్ స్టేట్‌మెంట్ ఎందుకు రికార్డు చేయలేదని నిలదీసింది. అతడిని ఎందుకు రక్షిస్తున్నారని ప్రశ్నించింది. ఇందులో ఏదో తప్పు ఉందని కోర్టు పేర్కొంది. సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని కోర్టు అభిప్రాయపడింది. హత్యాచార ఘటన తర్వాత సోషల్ మీడియాలో జరిగిన అవమానాన్ని భరించలేనని డాక్టర్ ఘోష్ రాజీనామా చేశారు. కొన్ని గంటల తర్వాత అతనికి కలకత్తా నేషనల్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్‌గా కొత్త పోస్టు ఇచ్చారు.
ఇదిలా ఉంటే కేసును ఆదివారంలోపు కొలిక్కి తీసుకురాకపోతే సీబీఐకి అప్పగిస్తానని సీఎం మమతా బెనర్జీ ప్రకటించారు. అలాగే ప్రతిపక్షాలు కూడా సీబీఐ దర్యాప్తునకు డిమాండ్ చేశాయి. మంగళవారం అనూహ్యంగా కోల్‌కతా హైకోర్టు సీబీఐకి అప్పగించింది.