Kunal Kamra: బాంబే హైకోర్టులో కునాల్ కమ్రా పిటిషన్..

ఎఫ్ఐఆర్‌లు కొట్టేయాలని వినతి;

Update: 2025-04-07 06:00 GMT

స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రా బాంబే హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదైన ఎఫ్ఐఆర్‌లను కొట్టేయాలని కోరుతూ సోమవారం న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. ముంబై పోలీసులు ఇప్పటికే మూడు సార్లు సమన్లు జారీ చేశారు. కానీ పోలీసుల విచారణకు మాత్రం కునాల్ హాజరు కాలేదు. ఇంతలో మద్రాస్ హైకోర్టు ఏప్రిల్ 7 వరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఈ గడువు ముగియడంతో తాజాగా బాంబే హైకోర్టును కునాల్ ఆశ్రయించారు. తన ప్రాణాలకు ముప్పు ఉందని తెలిసి కూడా.. వర్చువల్ విచారణకు పోలీసులు అంగీకరించడం లేదని పిటిషన్‌లో తెలిపారు. ఓ వైపు చంపేస్తామంటూ బెదిరింపులు ఉన్నా సరే.. భౌతికంగా హాజరు కావాలని పోలీసులు కోరడం ఏ మాత్రం కరెక్ట్ కాదని ఆరోపించారు. పిటిషన్ త్వరగా విచారించేలా న్యాయస్థానాన్ని కోరతామని కునాల్ తరపు న్యాయవాదులు పేర్కొన్నారు.

మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండేను ఉద్దేశించి కునాల్ కమ్రా అనుచిత వ్యాఖ్యలు చేశారు. శివసేనను చీల్చిన ‘ద్రోహి’ అంటూ సంబోధించారు. ఈ వ్యాఖ్యలే తీవ్ర దుమారం రేపాయి. కునాల్ కమ్రా ప్రోగ్రాం నిర్వహించిన క్లబ్‌పై శివసేన కార్యకర్తలు దాడి చేశారు. అంతేకాకుండా ఆయనపై పలు స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. అనంతరం కునాల్ కమ్రాను పలువురు శివసేన కార్యకర్తలు హెచ్చరించారు. అంతేకాకుండా ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, డిప్యూటీ సీఎం అజిత్ పవార్ కూడా ఖండించారు.

ప్రస్తుతం కునాల్ కమ్రా పుదుచ్చేరిలో ఉన్నారు. ఇక కునాల్‌కు రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ మద్దతు తెలిపారు. కునాల్ వ్యాఖ్యల్ని తప్పుగా అర్థం చేసుకున్నారని తెలిపారు.

Tags:    

Similar News