ARMY: అయిదుగురు జవాన్ల మృతి
విన్యాసాలు చేస్తుండగా ఆకస్మిక వరదలు సంభవించి మరణించిన ఐదుగురు జవాన్లు;
కేంద్ర పాలిత ప్రాంతం లడ్డాఖ్ వాస్తవాధీన రేఖ సమీపంలో గల న్యోమా చుషుల్ ప్రాంతంలో భారత సైన్యం విన్యాసాలు చేస్తుండగా ఆకస్మిక వరదలు సంభవించి ఐదుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. లేహ్‌కు 148 కిలోమీటర్ల దూరంలోని బోధి నదిలో ఈ ప్రమాదం సంభవించింది. విన్యాసాల్లో భాగంగా యద్ధ ట్యాంక్‌లతో నదిని దాటుతుండగా ఈ వరదలు సంభవించాయిని అధికారులు తెలిపారు. నదిలో నీటి ఉద్ధృతి పెరిగి టీ-72 ట్యాంక్ మునిగిపోయిందని... అందులోని ఐదుగురు జవాన్లు నదిలో కొట్టుకుపోయారని ఆర్మీ అధికారులు తెలిపారు. అప్రమత్తమైన సైన్యం వెంటనే సహాయక చర్యలు చేపట్టిందని. జవాన్ల కోసం నదిలో గాలించిందని.. ఈ ప్రమాదంలో వారంతా ప్రాణాలు కోల్పోయినట్లు రక్షణశాఖ అధికారులు వెల్లడించారు. ఐదుగురి మృతదేహాలను గుర్తించినట్లు తెలిపారు. మృతుల్లో జూనియర్ కమిషన్డ్ అధికారి కూడా ఉన్నారు.
ఆకస్మిక వరదలు సంభవించి ఐదుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోవడంపై రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఐదుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోవడం విచారకరమని ఆవేదన వ్యక్తం చేశారు. దేశం కోసం మన సైనికుల అపార సేవను ఎప్పటికీ మర్చిపోలేమని...వారికి అండగా నిలుస్తామని రాజ్‌నాథ్ ట్వీట్ చేశారు.