Rajasthan : గనిలో చిక్కుకున్న 15 మంది సేఫ్.. కానీ

కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్;

Update: 2024-05-15 03:00 GMT

 గనిలో తనిఖీలకు వెళ్లిన అధికారులు.. ప్రమాదవశాత్తూ అందులో చిక్కుకున్నారు. వారు లోపలికి వెళ్లి తిరిగి లిఫ్ట్‌లో పైకి వస్తుండగా.. అది ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో 15 మంది లోపలే ఉండిపోయారు. ఈ ప్రమాద ఘటన రాజస్థాన్‌లోని ఝన్‌ఝన్ జిల్లాలోని రాగి గనుల్లో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. సిబ్బందిని తరలించేందుకు ఉపయోగించే లిఫ్ట్‌ కూలిపోయింది. దీంతో హిందూస్థాన్‌ కాపర్‌ లిమిటెడ్‌కు చెందిన విజిలెన్స్‌ బృందం సిబ్బంది, అధికారులు 15 మంది గనిలో చిక్కుకుపోయారు. లోపలి చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయక చర్యలు చేపట్టారు. ప్రస్తుతానికి  వీరిలో ముగ్గురిని రెస్క్యూ టీమ్​ సురక్షితంగా బయటకు తీశారు. తీవ్రంగా గాయపడిన ఈ ముగ్గురు   హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. వీరికి ఎలాంటి ప్రాణభయం లేదని వైద్యులు తెలిపారు. గనిలో చిక్కుకున్న మిగతా వారికి  కాళ్లు, చేతులపై స్వల్ప గాయాలు అయ్యాయని, కానీ వారందరూ సురక్షితంగానే ఉన్నారని సమాచారం. వీరిని నిచ్చెనల ద్వారా బయటకు తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

కొనసాగుతున్న సహాయక చర్యలు!

మంగళవారం రాత్రి సుమారుగా 8 గంటలకు కార్మికులు గనిలోంచి బయటకు వస్తుండగా, లిఫ్ట్ తెగిపోయింది. దీనితో 15 మంది 1875 అడుగుల లోతులో చిక్కుకుపోయారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది వారికి ఔషధాలు, ఆహారం ప్యాకెట్లు అందించారు. గనిలో చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటకు తీసేందుకు కోల్​కతాకు చెందిన ఎస్​బీఆర్​ఎఫ్ బృందం ఖేత్రీకి వచ్చింది. ఎన్​డీఆర్​ఎఫ్ బృందం కూడా సహాయక చర్యల్లో పాలుపంచుకుంటోంది. ఈ రెస్యూ బృందాలు రెండూ కలిసి ముగ్గురిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చాయి. గనిలో చిక్కుకున్న మిగతా 12 మందిని కూడా వెలికి తీసేందుకు ముమ్మరంగా కృషి చేస్తున్నాయి.

ఆదుకోనున్న ప్రభుత్వం

రాగి గనిలో కార్మికులు చిక్కుకున్న విషయం తెలుసుకున్న రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్​ లాల్​ శర్మ, సహాయ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. దీంతో జిల్లా కలెక్టర్ నీమ్‌కథానా శరద్ మెహ్రా, ఎస్పీ ప్రవీణ్ కుమార్ నాయక్ నునావత్, సీఎంహెచ్‌ఓ వినయ్ గెహ్లావత్ సహా పలువురు అధికారులు, వైద్యులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. అత్యవసర సహాయం కోసం అంబులెన్స్​లను సిద్ధం చేశారు. మరోవైపు ఘటనపై ఆందోళన కాంగ్రెస్ నాయకుడు సచిన్ పైలట్ వ్యక్తం చేశారు. కార్మికులను సురక్షితంగా బయటకు తీసుకువచ్చేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.

Tags:    

Similar News