POLLS: నాలుగో విడతలో బరిలో ప్రముఖులు

పోటీలో అధీర్‌రంజన్‌ చౌధరీ, మహువా మొయిత్రా.... బరిలో మాజీ క్రికెటర్‌ యూసఫ్‌ పఠాన్‌;

Update: 2024-05-12 00:30 GMT

 సార్వత్రిక సమరంలో నాలుగో విడత జరగనున్న 96 నియోజకవర్గాల పోలింగ్‌లో పలువురు ప్రముఖులు బరిలో నిలిచారు. నాలుగోదశలో కేంద్రమంత్రులు గిరిరాజ్‌సింగ్‌, అర్జున్‌ ముండా, లోక్‌సభలో కాంగ్రెస్‌ పక్ష నేత అధీర్‌రంజన్‌ చౌధరీ, తృణమూల్ నేత మహువా మొయిత్రా సహా పలువురు ప్రముఖులు బరిలో ఉన్నారు. బిహార్‌లో అత్యంత కీలక నియోజకవర్గాల్లో ఒకటైన బెగుసరాయ్‌ నుంచి కేంద్రమంత్రి గిరిరాజ్‌ సింగ్‌ లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అదేస్థానం నుంచి భాజపా తరఫున మళ్లీ బరిలో నిలిచారు. బెగుసరాయ్‌ని బిహార్‌ మినీ మాస్కోగా పిలుస్తారు. ఇక్కడ భూమిహార్‌ వర్గీయుల ప్రాబల్యం ఎక్కువగా ఉంటుంది. గిరిరాజ్‌సింగ్‌సహా ఇప్పటివరకు అక్కడ నుంచి గెలిచిన ఎంపీల్లో అత్యధికులు ఆవర్గంవారే. 2019 ఎన్నికల్లో...సీపీఐ అభ్యర్థి కన్నయ్య కుమార్‌పై గిరిరాజ్‌ 4.2లక్షల ఓట్ల తేడాతో గెలుపొందారు. 86శాతం హిందూ జనాభా కలిగిన బెగుసరాయ్‌...ఎన్డీయేకు కంచుకోటగా ఉంది. అందుకే గిరిరాజ్‌ సింగ్‌ ఈసారి కూడా విజయంపై ధీమాతో ఉన్నారు.

పశ్చిమ బంగాల్‌లో కాంగ్రెస్‌, తృణమూల్‌ కాంగ్రెస్‌లు ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ముర్షిదాబాద్‌ జిల్లాలోని బహరంపుర్‌ లోక్‌సభ స్థానం అందరిదృష్టిని ఆకర్షిస్తోంది. లోక్‌సభలో కాంగ్రెస్‌ పక్ష నేత అధీర్‌ రంజన్‌ చౌధరి 1999 నుంచి బహరంపుర్‌ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఈసారి అధీర్‌ రంజన్‌కు పోటీగా మాజీ క్రికెటర్‌ యూసఫ్‌ పఠాన్‌ను టీఎంసీ బరిలోకి దింపింది. గుజరాత్‌కు చెందిన యూసఫ్‌ పఠాన్‌ అన్ని రకాల క్రికెట్‌ ఫార్మాట్ల నుంచి 2021లోనే రిటైరయ్యారు. బహరంపుర్‌లో ఐదు సార్లు ఎంపీగా నెగ్గిన అధీర్‌...ఈసారి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. నిరుద్యోగం, కార్మికుల వలసలు ప్రధాన సమస్యలుగా ఉన్నాయి. బీజేపీ నుంచి నిర్మల్‌ చంద్ర సాహ పోటీ చేస్తున్నారు. ప్రముఖ వైద్యుడిగా ఆయనకు పేరుంది.

బాలీవుడ్‌లో బిహారీబాబుగా గుర్తింపు పొందిన కేంద్ర మాజీమంత్రి శత్రుఘ్న సిన్హా... పశ్చిమ బంగాల్‌లోని అసన్సోల్‌ నుంచి టీఎంసీ తరఫున రెండోసారి బరిలో నిలిచారు. ఇక్కడ దాదాపు 50శాతం మంది బెంగాలీయేతరులే ఉన్నారు. అందులో అత్యధికులు బిహారీలు కావటం శత్రుఘ్నసిన్హాకు కలిసి వచ్చే అంశంగా మారింది. అందుకే 2022 ఉపఎన్నికల వేళ టీఎంసీ వ్యూహాత్మకంగా ఆయనకు టికెట్‌ ఇచ్చింది. అప్పుడు విజయం సాధించిన సిన్హా...మళ్లీ బరిలో దిగారు. ఆయన్ను బయటివ్యక్తిగా ప్రచారం చేస్తున్న బీజేపీ...స్థానికంగా సర్దార్‌జీగా సుపరిచితుడైన కేంద్ర మాజీమంత్రి సురేంద్రజీత్‌సింగ్‌ అహ్లువాలియాకు టికెట్‌ ఇచ్చింది. స్థానికుడికి, స్థానికేతరుడికి మధ్య పోరుగా ఈ ఎన్నిక మారింది. ఇక్కడ సీపీఎం కూడా పోటీ చేస్తున్నప్పటికీ...ప్రధానంగా సిన్హా, సర్దార్‌జీ మధ్యే నువ్వా-నేనా అన్నట్లు పరిస్థితి తయారైంది. తాగునీటి కొరత, నిరుద్యోగం అంశాలు ప్రధాన సమస్యలుగా ఉన్నాయి.

సమాజ్‌వాదీ పార్టీ-SP అధినేత, ఉత్తర్‌ప్రదేశ్‌ మాజీ సీఎం అఖిలేశ్‌ యాదవ్‌ ప్రస్తుతం కన్నౌజ్‌ నుంచి బరిలో నిలిచారు. తొలుత RJD అధ్యక్షుడు లాలుప్రసాద్‌ యాదవ్‌ అల్లుడు తేజ్‌ప్రతాప్‌ యాదవ్‌ను అభ్యర్థిగా ప్రకటించిన ఎస్పీ...తర్వాత మనసు మార్చుకుని అఖిలేశ్‌ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది. 2000, 2004, 2009 ఎన్నికల్లో కన్నౌజ్‌ నుంచి అఖిలేష్‌ ఎంపీగా గెలుపొందారు. 2012లో సీఎం పగ్గాలు చేపట్టాక ఆయన రాజీనామా చేశారు. అప్పుడు జరిగిన ఉపఎన్నికలో ఆయన సతీమణి డింపుల్‌ యాదవ్‌ ఏకగ్రీవంగా గెలుపొందారు. 2014లోనూ రెండోసారి గెలిచిన ఆమె... 2019 ఎన్నికల్లో భాజపా అభ్యర్థి సుబ్రత్‌ పాఠక్‌ చేతిలో ఓడిపోయారు. డింపుల్‌ ఈసారి మైన్‌పురి నుంచి బరిలో నిలిచారు. మరోసారి సిటింగ్‌ ఎంపీ సుబ్రత్‌ పాఠక్‌కు భాజపా టికెట్‌ కేటాయించింది. అయిదేళ్లక్రితం తన సతీమణి డింపుల్‌ను ఓడించిన సుబ్రత్‌పై బదులు తీర్చుకోవాలని అఖిలేశ్‌ బరిలో నిలిచారు.

Tags:    

Similar News