Manish Sisodia: ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాపై లుక్‌ఔట్ నోటీసులు..
Manish Sisodia: ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మనీశ్ సిసోడియాపై లుక్‌ఔట్ నోటీసులు జారీ చేశారు.;
Manish Sisodia: ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాపై లుక్‌ఔట్ నోటీసులు జారీ చేసింది సీబీఐ. దేశం విడిచి వెళ్లిపోకుండా సీబీఐ ఈ చర్యలు చేపట్టింది. సిసోడియాతో పాటు ఎఫ్‌ఐఆర్‌లో ఉన్న మరో 12 మందిపైనా సీబీఐ లుక్‌ఔట్ నోటీసులు జారీ చేసింది. ఈ లుక్‌ఔట్ నోటీసులపై సిసోడియా ట్విటర్ వేదికగా స్పందించారు. సీబీఐ తనిఖీలన్నీ ఫెయిల్ అయ్యాయని, అందుకే ఇలా ప్రవర్తిస్తోందంటూ కామెంట్ చేశారు.
సీబీఐ సోదాల్లో తన ఇంట్లో ఒక్క పైసా కూడా లభించలేదని తెలిపారు. అయినా.. తాను కళ్ల ముందే కనిపిస్తున్నా.. లుక్‌ఔట్ నోటీసులు జారీ చేయడం ఏంటని ప్రశ్నించారు. ఇవేం నాటకాలు అంటూ నరేంద్ర మోదీని ఘాటుగా ప్రశ్నించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. కుంభకోణంలోని నిందితులకు సీబీఐ సమన్లు జారీ చేసింది.
ఇప్పటి వరకు ముగ్గురిని ప్రశ్నించిన సీబీఐ అధికారులు.. త్వరలో మరికొందరికి సమన్లు జారీ చేయనుంది. ఇప్పటికే ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా సహా మొత్తం 15 మంది పేర్లను ఎఫ్‌ఐఆర్‌లో చేర్చింది సీబీఐ. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో సీబీఐ రెండు మూడు రోజుల్లో తనను అరెస్ట్ చేయొచ్చని మనీశ్ సిసోడియా సంచలన వ్యాఖ్యలు చేశారు.
తాను భగత్ సింగ్ ఫాలోవర్‌నని.. సీబీఐ, ఈడీ దాడులకు బెదిరే వ్యక్తిని కాదన్నారు మనీశ్ సిసోడియా. తానెలాంటి అవినీతికి పాల్పడలేదని, ఎక్సైజ్ పాలసీ పూర్తిగా పారదర్శకంగా రూపొందించామని చెప్పుకొచ్చారు. మనీశ్ సిసోడియా నివాసం సహా వివిధ ప్రాంతాల్లో సోదాల్లో స్వాధీనం చేసుకున్న కీలక డాక్యుమెంట్లు, బ్యాంక్ లావాదేవీల పత్రాలు, ఎలక్ట్రానిక్ పరికరాలను సీబీఐ అధికారులు పరిశీలిస్తున్నారు.
ఈ డాక్యుమెంట్స్ పరిశీలన పూర్తయిన తర్వాత మరికొందరు నిందితులకు సమన్లు జారీ చేయనున్నారు. కేసులో నిందితులుగా ఉన్న వారందరినీ ఒక్కొక్కరుగా పిలిపించి, లిక్కర్ కుంభకోణంపై లోతుగా విచారిస్తామని సీబీఐ తెలిపింది. ఈ కుంభకోణంలో మనీ లాండరింగ్ కూడా జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతుండడంతో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సైతం దృష్టి పెట్టింది. ప్రత్యేక కోర్టులో దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్‌లోని సమాచారాన్ని సీబీఐ.. ఈడీకి అందజేసింది.