జైల్లో ఉన్న మాఫియా డాన్.. ఛాతీ నొప్పి కారణంగా ఐసీయూలో

జైలులో ఉన్నప్పుడు తనకు స్లో పాయిజన్‌ ​​ఇస్తున్నారని ముఖ్తార్ అన్సారీ ఆరోపించారు.;

Update: 2024-03-26 06:13 GMT

మాఫియా డాన్ ముఖ్తార్ అన్సారీ గత రాత్రి ఛాతీ నొప్పితో బాధపడుతూ ఉత్తరప్రదేశ్‌లోని బందా మెడికల్ కాలేజీలో చేరాడు. అన్సారీ ప్రస్తుతం ఆసుపత్రిలోని ఐసీయూ వార్డులో అబ్జర్వేషన్‌లో ఉన్నారు. మెడికల్ కాలేజీ చుట్టూ భారీగా పోలీసు బలగాలను మోహరించి భద్రతను కట్టుదిట్టం చేశారు.

గత వారం, వర్చువల్ కోర్టుకు హాజరైన ముక్తార్ అన్సారీ జైలులో ఉన్నప్పుడు తనకు స్లో పాయిజన్ ఇస్తున్నారని ఆరోపించారు.

జైలులో తనకు తగిన వైద్య సదుపాయాలు అందడం లేదని విచారణ సందర్భంగా పలుమార్లు కోర్టుకు ఫిర్యాదు చేయడం గమనార్హం. ఇంతలో, ఈ సమాచారం అందుకున్న ముఖ్తార్ అన్సారీ బంధువులు కూడా బందా మెడికల్ కాలేజీకి చేరుకున్నారు.

అన్సారీ భద్రతా ఏర్పాట్లలో నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ఆరోపణల నేపథ్యంలో, ప్రభుత్వం ఒక జైలర్ మరియు ఇద్దరు డిప్యూటీ జైలర్లను సస్పెండ్ చేసింది. 

గత వారం రోజులుగా అన్సారీ ఆరోగ్యం క్షీణించడంతో వైద్య కళాశాలలో చేర్పించారు.

ముఖ్తార్ అన్సారీ చేసిన ఆరోపణలు

40 రోజుల క్రితం తనకు విషం కలిపిన ఆహారం ఇచ్చారని అన్సారీ పేర్కొన్నాడు. బండా జైలులో తన భద్రత గురించి అతను ఆందోళన వ్యక్తం చేశాడు, తనపట్ల జైలర్, ఇద్దరు డిప్యూటీ జైలర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు చేశాడు.

జైలులో తనకు ప్రాణహాని ఉందని పేర్కొంటూ తన లాయర్ ద్వారా దరఖాస్తును పంపాడు. మార్చి 19న తనకు ఇచ్చిన ఆహారం విషపూరితమైందని, దీంతో తీవ్ర నొప్పి, అసౌకర్యం కలుగుతోందని ఆరోపించారు.

అంతకుముందు మార్చిలో, 36 ఏళ్ల నకిలీ ఆయుధాల లైసెన్స్ కేసులో అన్సారీకి జీవిత ఖైదు విధించబడింది. తదుపరి విచారణ మార్చి 29కి వాయిదా పడింది.

Tags:    

Similar News