Traffic Jam: మహారాష్ట్రలో ప్రాణం తీసిన ట్రాఫిక్‌ జామ్‌!

నొప్పితో విలవిల్లాడుతూ అంబులెన్స్‌లోనే పోయిన ప్రాణం;

Update: 2025-08-11 04:15 GMT

అంబులెన్సులో ఆస్పత్రికి తరలిస్తుండగా జాతీయ రహదారిపై భారీ ట్రాఫిక్‌ జామ్‌ కారణంగా ఓ మహిళ ప్రాణాలు కోల్పోవడం విషాదం రేపింది. మహారాష్ట్రలోని ముంబయి సమీపంలో ఇటీవల చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. పాల్‌ఘర్ జిల్లాకు చెందిన ఛాయా పూరవ్‌ (45) అనే మహిళ మరణం అటు ఆ జిల్లాలోని ఆరోగ్య వసతుల దుస్థితినీ, ఇటు ముంబయి మహానగరానికి అనుసంధానించే ఎన్‌హెచ్‌- 48పై ట్రాఫిక్‌ పరిస్థితినీ ఒకేసారి ఎత్తిచూపింది. వివరాల్లోకి వెళ్తే..

తమ ఇంటికి సమీపంలో చెట్టుకొమ్మ విరిగిపడటంతో ఛాయ్‌ పూరవ్‌ తీవ్రంగా గాయపడ్డారు. ఆమె పక్కటెముకలు, భుజాలు, తల భాగంలో గాయాలయ్యాయి. దీంతో అక్కడ ట్రామా సెంటర్ లేకపోవడంతో స్థానిక ఆసుపత్రి సిబ్బంది ఆమెను ముంబయిలోని హిందుజా ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారు. 100 కి.మీ.ల దూర ప్రయాణానికి సాధారణంగా 2.5 గంటల సమయం పడుతుందన్న ఉద్దేశంతో ఆమెకు అనస్థీషియా ఇచ్చారు. అనంతరం మధ్యాహ్నం 3గంటల సమయంలో అంబులెన్సులో బయల్దేరగా.. ఎన్‌హెచ్‌-48లో భారీ ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకుపోయారు. దీంతో సాయంత్రం 6గంటల వరకు కేవలం సగం దూరం మాత్రమే చేరుకోగలిగారు.

ఈ నేపథ్యంలో ఆమెకు అనస్థీషియా ప్రభావం తగ్గడంతో విపరీతమైన నొప్పి భరించలేక విలవిల్లాడిపోయారు. ఈ క్రమంలో తక్షణ వైద్య సాయం అందించేందుకు అంబులెన్స్‌ సిబ్బంది రాత్రి 7 గంటల సమయంలో మీరా రోడ్‌లోని ఆర్బిట్ ఆసుపత్రికి (హిందుజా ఆస్పత్రికి 30కి.మీ.ల దూరంలో) తీసుకెళ్లారు. కానీ అప్పటికే చాలా ఆలస్యమైపోయింది. ఆమెను పరీక్షించిన వైద్యులు మృతి చెందినట్లు ప్రకటించారు. కనీసం 30 నిమిషాల ముందు ఆస్పత్రికి తీసుకొచ్చి ఉంటే కాపాడేవాళ్లమని ఆమె భర్త కౌశిక్‌కు తెలిపారు.

నొప్పితో విలవిల్లాడటం కళ్లారా చూశా: భర్త ఆవేదన

ఈ ఘటనపై మృతురాలి భర్త కౌశిక్‌ మాట్లాడుతూ.. తన భార్య నాలుగు గంటల పాటు భరించలేని నొప్పితో విలవిలలాడటం చూశానన్నారు. రోడ్డు గుంతలమయంగా ఉందని.. అదే ఆమె బాధకు మరింత కారణమని వాపోయారు. నొప్పితో అరుస్తూ ఏడ్చిందని.. తొందరగా ఆస్పత్రికి తీసుకెళ్లాలని వేడుకుందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ట్రాఫిక్‌లో ఇరుక్కుపోవడంతో సకాలంలో ఆస్పత్రికి చేరుకోలేకపోయామన్నారు.

Tags:    

Similar News