Operation Jharkhand : ఆ ముగ్గురు ఎమ్మెల్యేలను కొనేశారు : మమతా బెనర్జీ
Operation Jharkhand : ఆపరేషన్ మహారాష్ట్ర సక్సెస్. ఇక ఇప్పుడు జార్ఖండ్ వంతా?;
Operation Jharkhand : ఆపరేషన్ మహారాష్ట్ర సక్సెస్. ఇక ఇప్పుడు జార్ఖండ్ వంతా? జార్ఖండ్‌లో సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందా? బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అయితే డైరెక్టుగానే ఈ ఆరోపణలు చేశారు. హేమంత్ సోరెన్ సర్కార్‌ను కూల్చేందుకు కాషాయదళం మరో షిండేను తయారుచేస్తోందంటూ విమర్శించారు.
జార్ఖండ్‌కు చెందిన ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు.. పశ్చిమ బెంగాల్ నుంచి జార్ఖండ్‌కు కారులో వస్తుండగా పోలీసులు ఆపి తనిఖీలు చేశారు. కారు డిక్కీలో 500 రూపాయల నోట్ల కట్టలు బయటపడ్డాయి. వాటిని లెక్కించేందుకు కౌంటింగ్ మిషిన్‌ను సైతం తెప్పించారు పోలీసులు.
ఈ ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీజేపీ నేతలు కొనేశారన్నది మమతా బెనర్జీ ఆరోపణ. కొన్ని రోజులుగా జార్ఖండ్‌లోని హేమంత్ సర్కార్ కూలిపోతుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. దీనికి ఊతమిచ్చేలా.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు డబ్బు కట్టలతో పట్టుబడ్డారు.
జార్ఖండ్‌లో జార్ఖండ్ ముక్తి మోర్చా, కాంగ్రెస్ కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. 2019 ఎన్నికల్లో బీజేపీ ఓడిపోవడంతో.. జార్ఖండ్‌లో అధికారం చేజిక్కించుకోడానికి బీజేపీ ఈ స్కెచ్ వేసిందన్నది ప్రధాన ఆరోపణ. ఇప్పటికే హేమంత్ సోరెన్ ప్రభుత్వంపై బీజేపీ అవినీతి ఆరోపణలు గుప్పిస్తోంది.
రాంచీలో మైనింగ్ లీజులు, భూకేటాయింపుల్లో భారీ అవినీతి జరిగిందంటూ జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ టార్గెట్‌గా ఆరోపణలు చేస్తోంది బీజేపీ. హేమంత్ సోరెన్ అవినీతిపరుడు అంటూ ముద్ర వేసి.. రాజీనామాకు డిమాండ్ చేస్తోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌కు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు భారీ నగదుతో పట్టుబడడంతో.. బీజేపీ గేమ్‌ప్లాన్ మొదలైందని, జార్ఖండ్‌లోనూ మరో షిండేను తయారు చేస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి.